చాకలిపాలెంలో అన్న క్యాంటిన్ ప్రారంభిస్తున్న టిడిపి నాయకులు
ప్రజాశక్తి-మామిడికుదురు(పి.గన్నవరం) చంద్రబాబు పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని రామచంద్రపురం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి సర్పంచ్ ప్రతిపాటి ఉమామహేశ్వరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం చాకలిపాలెం సెంటర్ గటిగంటి శ్రీనివాస్ కాంప్లెక్స్ నందు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను పాలకొల్లు ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, నామన రాంబాబులు ప్రారంభించారు. ఉండవల్లి మూర్తి, రామ్మూర్తి కుమారుడు శ్రీకాంత్ ఆర్థిక సాయంతో అన్న క్యాంటీన్ నిర్వహించారు. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మను ఆదర్శంగా తీసుకుని గత టిడిపి ప్రభుత్వం అన్న క్యాంటీన్లు నిర్వహించగా పేదల ఆదరణ చూడలేక అధికారం చేపట్టిన వెంటనే వైసిపి ప్రభుత్వం దుర్మార్గపు చర్యగా అన్న క్యాంటీన్లు ధ్వంసం చేసిందన్నారు. జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, వైస్ ఎంపిపి చెల్లుబోయిన గంగాభవాని, టిడిపి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.