ప్రజాశక్తి-రాజోలువైఎస్‌ఆర్ రైతు భరోసా లబ్ధి జమ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మీట నొక్కి 20 రోజులైనా చాలామంది రైతుల ఖాతాల్లో ఇంకా పడలేదు. దీంతో వారందరికీ ఎదురుచూపులే మిగిలాయి. ఈ నెల 7న పుట్టపర్తిలో జరిగిన కార్యక్రమంలో సిఎం బటన్ నొక్కారు. వెంటనే నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమవుతుందని ప్రకటించారు. ఇది జరిగి రెండు వారాలు దాటిపోయినా ఖాళీగానే ఖాతాలు దర్శనమిస్తున్నాయి. పిఎం కిసాన్ నగదు అందినా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వైఎస్‌ఆర్ రైతు భరోసా లబ్ధి మాత్రం చేరలేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో రైతు భరోసా-పిఎం కిసాన్ కింద 1,65,382 మంది రైతులకు రూ.68.03 కోట్లు రావాలి. వీటిలో కేంద్రం 1.56 లక్షల మందికి పిఎం కిసాన్‌లో భాగంగా రూ.31.31 కోట్లు ఇప్పటికే జమ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత వాయిదా కింద 5500 మంది కౌలు రైతులకు రూ.2 వేల చొప్పున దేవాదాయ శాఖ భూములు సాగు చేసే రైతులకు రూ.4 వేల వంతున రూ.37 కోట్లు జమ చేయాల్సి ఉంది.మూడు విడతల్లో మొత్తం లబ్ధి ఏటా మూడు విడతల్లో మొత్తం రూ.13,500 ఇస్తున్నారు. ఇందులో పిఎం కిసాన్ రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 ఇస్తోంది. తొలి విడతగా ఖరీఫ్ పంట వేసే సమయంలో మే నెలలో రూ.7,500 అందిస్తారు. దీనిలో పిఎం కిసాన్ నుంచి రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5,500 ఇస్తారు. రెండో విడతగా అక్టోబరు, నవంబర్‌లో ఖరీఫ్ కోతల సమయం, రబీ ఆరంభంలో రూ.4 వేలు ఇస్తారు. దీనిలో రూ.2 వేలు పిఎం కిసాన్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.2 వేలు వేస్తారు. మూడో విడతగా పంట ఇంటికొచ్చే సమయాన జనవరి, ఫిబ్రవరి నెలల్లో పిఎం కిసాన్ కింద రూ.2 వేలు ఇస్తారు.రబీ అవసరాల కోసం…!జిల్లాలో ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెల కొన్నాయి. వంశధార, నాగావళి నదుల ద్వారా సాగునీటి వ్యవస్థలున్నా నీరందని పరిస్థితి. చెరువులు, ఇతర వనరుల ద్వారా వేసిన పంటను కాపాడు కునేందుకు రైతులు రూ.లక్షలు ఖర్చు చేశారు. అప్పులు సైతం చేశారు. ప్రస్తుతం ఖరీఫ్ కోతల సమయం, రబీ అవసరాలకు ఊరటనిచ్చేలా రెండో విడతగా నవంబరు నెల ముగిసేలోగా ప్రభుత్వాలు రూ.4 వేలు జమ చేయాల్సి ఉంది. దీనిలో పిఎం కిసాన్ కింద రూ.2 వేలు జమయ్యాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వైఎస్‌ఆర్ రైతు భరోసా రూ.2 వేలు ఇంకా చాలామంది ఖాతాల్లో పడలేదు.అరకొరగా ఇచ్చినా.. అందని సాయం..!జిల్లాలో వరి, ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతుల్లో 90 శాతం కౌలుదారులే. జిల్లాలో సుమారు 1.80 లక్షల మంది కౌలురైతులు ఉండగా.. వారిలో 77 వేల మందికి సిసిఆర్‌సి కార్డులు ఇవ్వాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. 60 వేల మందికి మాత్రమే కార్డులు అందించారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ కౌలురైతులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా అందిస్తుండగా, సిసిఆర్‌సి కార్డుల మంజూరులో జాప్యం, కొంతమంది రైతులకు కార్డులు ఇవ్వడానికి అసలు రైతుల అంగీకారం లేకపోవడం వంటి పరిస్థితుల్లో గడువులోగా రైతుభరోసా పోర్టల్‌లో నమోదుకాక కొంతమంది పథకానికి దూరమయ్యారు. ఉద్యాన పంటల నష్టం అంచనాల్లో కొంతమంది రైతులను విస్మరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.