ప్రజాశక్తి-విశాఖపట్నం క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా రూ.7.57 కోట్లతో పెదగంట్యాడ ఇండిస్టియల్ ఎస్టేట్ పరిధిలో నిర్మించనున్న ఎఫ్‌ఎఫ్‌సి (ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సు)కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో పలు పరిశ్రమల ప్రారంభోత్సం, శంకుస్థాపన సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వర్చువల్‌గా ఈ కార్యక్రమం చేపట్టారు. 1.22 ఎకరాల స్థలంలో నిర్మించనున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సుకు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టుకు కేంద్రం 70 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వ్యయం సమకూర్చనున్నాయి. స్థానిక కలెక్టరేట్ వీసీ హాలులో ఏర్పాటు చేసిన నమూనా శిలాఫలకాన్ని వర్చ్యువల్ విధానంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, పరిశ్రమల శాఖ జీఎం గణపతి, ఐలా కమిషనర్ జయచంద్ర, ఏపీఐఐసీ అధికారులు, పలువురు పారిశ్రామిక వేత్తలు భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ, కాంప్లెక్సు ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులను త్వరితగతిన కల్పించాలని, సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేసి వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అంతర్గత రోడ్లు, డ్రెయిన్లు, నీటి వసతి, ఇతర సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.