ఎట్టకేలకు పంచగ్రామాల అపరిష్కృత రెవెన్యూ సమస్య పరిష్కారం
గాడ్‌గూడ, బిస్టూం గూడ, డొల్లిగూడ రైతులకు పట్టాల పంపిణీ
కలెక్టర్ సుమిత్‌కుమార్, పిఒ అభిషేక్‌లకు సర్పంచ్ దాసుబాబు కృతజ్ఞతలు
ప్రజాశక్తి-అరకులోయ :స్వాతంత్య్రానికి పూర్వం నుంచి చేస్తున్న పోరాటమది. ఎన్నో ప్రభుత్వాలకు, అనేకమంది నాయకులకు విన్నవించినా పరిష్కారం గాని రెవెన్యూ సమస్య అది. తరతరాలపాటు తమ భూమికి హక్కులు కల్పించాలని పోరాటం చేసిన ఆ రైతుల కల నేటికి ఫలించింది. పెదలబుడు పంచాయతీ పరిధిలో ఉన్న అపరిష్కృత రెవెన్యూ పంచ గ్రామాల సమస్యకు సర్పంచ్ పెట్టెలి దాసుబాబు ఆధ్వర్యంలో చేసిన పోరాటం ఫలించింది. అల్లూరి జిల్లా కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పిఓ సంయుక్త చొరవతో ఆ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది.సర్పంచ్ దాసుబాబు వినతి మేరకుకలెక్టర్ సుమిత్ కుమార్ ఆ సమస్య పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపించారు. ఐదు గ్రామాల రైతులు సాగు చేసుకుంటున్న భూములను సర్వే చేయించి పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అందులో తొలి దశ పట్టాల పంపిణీ బుధవారం పెదలబుడు పంచాయతీలో నిర్వహించారు. తొలి దశలో మూడు గ్రామాలకు చెందిన 89 మంది గిరిజన రైతులకు ఈ పట్టాలను అందించారు. పెదలబుడు పంచాయతీ పరిధిలోని డొల్లి గూడ, గాడ్ గూడా, బిష్టుంగూడ గ్రామాల భూములకు ఐటిడిఎ పిఒ అభిషేక్, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొణ, సర్పంచ్ పెట్టెలి దాసు బాబు పట్టాలను అందించారు.మిగిలిన రెండు గ్రామాలు లింబగూడ, నువ్వగూడ, రైతులకు మరో నెల రోజుల్లో పట్టాల పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్నో ఏళ్లు పోరాడుతున్న సమస్యకు పరిష్కారం చూపిన కలెక్టర్ సుమిత్ కుమార్‌కు, ఐటీడీఏ పీవో అభిషేక్ ఐదు గ్రామాల ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ బాబు మాట్లాడుతూ, తాను సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అపరిష్కత రెవెన్యూ పంచ గ్రామాల సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నానన్నారు. అనేకసార్లు ఉమ్మడి విశాఖలోనూ, ఇపుడు అల్లూరి జిల్లాగా ఏర్పాటైన తర్వాత ఐదు గ్రామాల రైతులను వెంటబెట్టుకొని సమస్యలపై పదేపదే విన్నవించానన్నారు. ఎట్టకేలకు అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటిడిఎ పిఒ అభిషేక్ దృష్టికి ఈ పంచ గ్రామాల సమస్యను విన్నవించిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చి దాన్ని సాకారం చేశారని ఆనందం వ్యక్తం చేశారు.. కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్, విఆర్‌ఒ పవన్, ఎంపిటిసిలు భీమ్ రాజు, శత్రుఘ్న, ఉప సర్పంచ్ చందు విజరు నిర్మల, వార్డు సభ్యులు త్రినాథ్, భగత్ రాం, టిడిపి నాయకుడు కిల్లో నాగరాజు పాల్గొన్నారు.