ప్రజాశక్తి-గుంటూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, హెల్త్ క్లినికల్‌లు వంటి ప్రాధాన్యత భవనాలు నత్తనడకన సాగుతున్నాయి. నాలుగున్నరేళ్లుగా చేస్తున్నా ఇంత వరకూ 70 శాతమే పూర్తయ్యాయి. తాజాగా గ్రాంట్లు నిలిచిపోవటంతో భవనాల నిర్మాణాలు మరింత జాప్యమవుతున్నాయి. దీంతో క్షేత్ర స్థాయిలో నిర్మాణాలు చేపట్టిన చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. నిధుల్లేక, నిర్మాణాలు కొనసాగించలేక సతమతం అవుతున్నారు. కొత్త గుంటూరు జిల్లాలో తొలుత 207 సచివాలయ భవనాలు, 151 రైతు భరోసా కేంద్రాలు, 164 హెల్త్ క్లినిక్‌లు మొత్తం 522 ప్రాధాన్యతా భవనాలు మంజూరయ్యాయి. అయితే కోర్టు కేసులు, నిధుల సమస్యతో ప్రారంభ దశలోనే కొన్నింటి నిర్మాణం నిలిపేశారు. బేస్‌మెంట్ లెవల్, అంతకంటే తక్కువ ప్రగతి ఉన్న నిర్మాణాలు 173 భవనాలు నిలిచిపోయాయి. వాటిలో సచివాలయాలు 31, ఆర్‌బికెలు 72, హెల్త్ క్లినిక్‌లు 70 ఉన్నాయి. నిలిచిన భవనాలు కాక మిగిలిన 349 భవనాల్లో ఎట్టకేలకు 241 భవనాలు పూర్తయ్యాయి. ఇంకా 108 భవనాలు పూర్తి కావాల్సి ఉంది. అయితే కేంద్రం నుండి ఆయా భవనాలకు రావాల్సిన గ్రాంట్లు నిలిచిపోవంటంతో నిర్మాణాలు ముందుకు సాగట్లేదు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను మహాత్మా గాంధీ ఉపాధి హామీ నిధులతో చేపట్టారు. దీనిగాను సచివాలయాలకు ఒక్కొక్క యూనిట్‌కు రూ.40 లక్షల నుండి రూ.43 లక్షల వరకూ ఇస్తుంది. ఆర్‌బికెలకు రూ.21.8 లక్షల నుండి ఇటీవల కొత్తగా మంజూరు చేసే వాటికి రూ.23.94 లక్షలకు పెంచారు. హెల్త్ క్లినిక్‌లకు నేషనల్ హెల్త్ మిషన్ రూ.12 లక్షలు, ఉపాధి హామీ ద్వారా రూ.8.75 లక్షలిస్తారు. నిర్మాణాలకు సంబంధించి గుత్తేదారులకు వారానికి, పది రోజులకు నిధులు విడుదలవుతాయి. ప్రారంభంలో మొదటి రెండేళ్లు భవనాలకు స్థలాలు సేకరణ, అనుమతులు మంజూరుతో కాలం గడిచింది. తర్వాత చేపట్టిన నిర్మాణాలకు నిధులు సకాలంలో రాకపోవటంతో నత్త నడకన సాగుతున్నాయి. తాజాగా గత మూడు నెలల నుండి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కాలేదు. జిల్లాకు ఎన్‌హెచ్‌ఎం గ్రాంట్లు రూ.కోటి, ఉపాధి హామీ గ్రాంట్లు దాదాపు రూ.కోటి పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో కాంట్రాక్టర్లు పనులు కొనసాగించటానికి ఆసక్తి చూపట్లేదు. నిర్మాణాలు పూర్తి చేసినా, ఈలోగా ఎన్నికల కోడ్ వస్తే బిల్లులు సకాలంలో వస్తాయో రావోనని ఆందోళణ చెందుతున్నారు.త్వరితగతిన పూర్తి చేయటానికి చర్యలుజి.బ్రహ్మయ్య, పంచాయితీరాజ్ ఎస్‌ఇప్రాధాన్యత భవనాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయటానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 70శాతంపైగా భవనాలు నిర్మాణం పూర్తి చేసి, ప్రభుత్వానికి అప్పజెప్పాం. మిగిలిన వాటిని పూర్తి చేయటానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. డిసెంబర్ నెలాఖరుకు ఆర్‌బికెలు, హెల్త్ క్లినిక్‌లు, జనవరి 13కు సచివాలయాల భవనాలు పూర్తి చేయాలని లక్ష్యంగా కృషి చేస్తున్నాం.