ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి విద్యార్థులను బడికి చేర్చే ఆటోలు భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. ఆటో డ్రైవర్ల ఆత్యాస తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఉదయం 9 గంటల లోపు సాయంత్రం 4 గంటల తర్వాత నగర వీధుల్లో కిక్కిరిసిన బడి ఆటోలు దర్శనమిస్తున్నాయి. ఒకొక్క ఆటోలో కనీసం 10 నుంచి 14 మంది విద్యార్థులను కుక్కెస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ప్రమాదం గురించి తెలసిందే. మధ్య తరగతి, సాధారణ ప్రజలు తమ చిన్నారులను బడికి తీసుకుని వెళ్లే సమయం లేక ఆటోలు లేదా స్కూలు బస్సుల ద్వారా తమ చిన్నారులను స్కూళ్లకు పంపించడం పరిపాటి. యాజమాన్యాలు, రవాణా శాఖ అధికారుల పర్యవేక్షణ ఉండటంతో స్కూలు బస్సులను ప్రతి ఏటా వాహనాల తనిఖీలు, ఎన్‌ఓసీ సర్టిఫికెట్లు జారీ చేసిన అనంతరమే విద్యార్థుల ప్రయాణాలకు వినియోగిస్తున్నారు. స్కూల్‌కు చేర్చే ప్రయివేట్ వాహనాలపై ఆ తరహా పర్యవేక్షణ లేకపోవటం కలవరానికి గురిచేస్తోంది. అతి వేగం, ఎంత మంది పిల్లలను ఎక్కిస్తే అంత ఆదాయం అనే ఆలోచనలోనే డ్రైవర్లు ఉంటున్నారు. ఇదే ప్రమాదాలకు ముఖ్యకారణంగా మారుతుంది. స్కూలు పిల్లలను బడికి చేర్చేందుక ఆటోలకు రవాణా శాఖ నుంచి ప్రత్యేకమైన అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. దీంతో ఆటో డ్రైవర్లు యథేచ్ఛగా ప్రవర్తిస్తున్నారు. చిన్నారుల భద్రతను గాలికొదిలేస్తున్నారు.ఇరుకు రహదారుల్లోనూ అతివేగం జిల్లాలో సుమారు 15 వేల ఆటోలు ఉంటా యని అంచనా. ఎక్కువ శాతం ఆటోలు ప్రధాన రహదారుల నుంచి కాక సందుల్లో, చిన్నచిన్న రోడ్ల వెంట పిల్లలను తీసుకెళ్తుండడంతో వీటిపై నియంత్రణ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆటోలపై తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను కుక్కి అతివేగంగా డ్రైవర్లు ఆటోలను తోలుతున్నారు. ఒకవైపు పాఠశాల సమయం ముగుస్తుందని, గేటు వేస్తారని ముందు వెనక చూసుకోకుండా దూసుకువస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. అధికారుల నియంత్రణ లేకపోవడం, తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాల నిర్లక్ష్యంతో పాఠశాలల ఆటోలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రయివేట్ బస్సులకు ఫీజులు చెల్లించే స్థోమత లేని కారణంగా తప్పని పరిస్థితుల్లో తమ పిల్లలను ఆటోలో పంపించాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. పల్లెల నుంచి ఆర్‌టిసి బస్సులు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. అధిక మొత్తంలో ఆటో డ్రైవర్లకు వెచ్చిస్తున్నారు. నిబంధనలు ఇలా.. అప్పి ఆటోలు, టాటా మ్యాజిక్ లాంటి వాహనాలను పాఠశాల విద్యార్థులను తరలించేందుకు జిల్లాలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులను తరలించే వాహనాలకు సంబంధించి ఎప్పటి నుంచో ఉన్న నిబంధనలను ఆటో డ్రైవర్‌లు పాటించడం లేదు. సాధారణ ఆటోలలో విద్యార్థులను ఆరుగురికి మించి ఎక్కించకూడదు. టాటా మ్యాజిక్‌లో 10 మందికి మించకూడదు. డ్రైవర్ల పక్కన ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోపెట్టకూడదు. స్కూల్ ఆటోలకు సైడురాడ్లు తప్పక అమర్చాలి. ప్రతీ స్కూల్ ఆటోలో ప్రథమ చికిత్స కిట్‌లు తప్పనిసరిగా ఉండాలి. ఆటోలకు సంబంధించిన వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు ఎఫ్‌సీ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ తదితరాలు అందుబాటులో ఉంచుకోవాలి. డ్రైవర్ యూనిఫాం తప్పని సరిగా ధరించాలి. ఈ నిబంధనలు పాటించకుండా పోలీసు, రవాణాశాఖ దారుల్లో పట్టుబడితే జరిమానాలు భారీగా ఉంటాయని అధికారులు తెలుపుతున్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడి ఓవర్ లోడింగ్‌కు పాల్పడితే భారీ జరిమానాలు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త ఆటోలలో డ్రైవర్ సీటుకు అటు, ఇటు, లోపల కాస్తా కూడా ఖాళీ లేకుండా విద్యార్థులను ఎక్కించుకుంటున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ ఆటోలలో విద్యార్థుల రాకపోకలు మాత్రం ఆగడం లేదు. ఏదైన ప్రమాదం జరిగిన తర్వాత బాధపడేకంటే తల్లిదండ్రులు ముందే మేల్కొనాలి. బడి పిల్లలను ఆటోలలో స్కూళ్లకు పంపే తల్లిదండ్రులు ఆటోలలో అసలు ఎంత మంది వెళ్తున్నారు. ఆటో డ్రైవర్ ఎన్ని ట్రిప్పులు వేస్తున్నారు అనే విషయం ముందుగానే తెలుసుకోవాలి. ఆటో డ్రైవర్ పూర్తి వివరాలు ప్రతీ తల్లిదండ్రుల వద్ద ఉండాలి. డ్రైవర్ ఎంత స్పీడ్‌లో వెళ్తున్నాడో, పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నాడో ఎప్పటికప్పుడు పిల్లలను అడిగి తెలుసుకోవాలి. ఆటో సమాచారాన్ని సంబంధిత పాఠశాలలకు తల్లిదండ్రులే అందించాలి. స్కూల్ యాజమాన్యాలు, సిబ్బంది కూడా వారి స్కూళ్లకు ఎక్కువ మంది పిల్లలను తీసుకువచ్చే ఆటోలను అనుమతించకూడదు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే స్కూళ్లకు చెడ్డపేరు వస్తుందని యాజమాన్యం కూడా గుర్తించాలి. ఆటో ప్రయాణాలపై బాధ్యతగా మెలగాలి.ఆటోలో కిక్కిరిసిన విద్యార్థులు