ప్రజాశక్తి- హిందూపురం (శ్రీ సత్యసాయి జిల్లా) : హిందూపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా పట్టణంలో వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ రహమత్‌పురం సర్కిల్‌లో దాదాపు అరగంట వైసీపీ ఇన్‌చార్జ్ దీపిక వచ్చే వరకు ఆపారు. దీంతో నాలుగు వైపులా నుంచి వచ్చే వాహనాలన్నీ ఎక్కడికి అక్కడ ఆగిపోయాయి. ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు రోడ్డుపై పది నిమిషాలు ఆందోళన చేస్తే పోలీసులు ఆందోళనకారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అరెస్టులు చేస్తారు. అయితే అధికార పార్టీ నేతలు అరగంట ప్రధాన కూడలిలో వాహనాలు ఆపితే వేడుక చూస్తున్నారే.. తప్ప కనీసం వారికి వాహనాలు రోడ్డుకు ఒకవైపు ఆపండి.. అని సైతం చెప్పలేకపోయారు. ఇంచార్జ్ దీపిక వచ్చిన అనంతరం అక్కడి నుంచి ఆ వాహన ర్యాలీ బయలుదేరింది. అప్పటివరకు లేపాక్షి వైపు నుంచి, బైపాస్ రోడ్డు వైపు నుంచి, రైల్వే రోడ్డు వైపు, రహమత్ పురం వైపు ఇలా అన్ని వైపులా వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అధికార పార్టీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రధాన కూడలిలో వాహనాలు ఆపివేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.