ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి పోరాటాలు

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ప్రభుత్వ విద్యా రంగ బలోపేతానికి ఉపాధ్యా యుల సమస్యల పరిష్కా రానికి ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటుందని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా ద్వితీయ కౌన్సిల్‌ సమావేశాలు ఆదివారం గురజాల చల్లగుండ్ల ఫంక్షన్‌ హాలులో నిర్వహించారు. సమావేశానికి జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్‌ అధ్యక్షత వహించారు. తొలుత జాతీయ పతాకాన్ని సీనియర్‌ నాయకులు చిట్టెం వెంకటేశ్వర్లు ఎగురవేయగా, ఎస్‌టిఎఫ్‌ఐ జెండాను జి.సీతారెడ్డి, యుటిఎఫ్‌ పతాకాన్ని ఆర్‌.సాల్మన్‌రాజు ఎగురువేశారు. గురజాల ప్రధాన రహదారిపై ఉపాధ్యాయులు, యుటిఎఫ్‌ నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ 3, 4, 5 తరగతులను హైస్కూళ్లలో విలీనం చేయడం సరికాదన్నారు. పాఠశాలలను, ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పూనుకుందని విమర్శించారు. సిపిఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మోసపూరిత జిపిఎస్‌ తెచ్చారని, దీనికి తగిన మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అత్యంత గౌరవ ప్రదమైందని, ఆ గౌరవాన్ని వైసిపి ప్రభుత్వం హరిస్తోందని అన్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థికపరమైన బకాయిలను టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెల్లిస్తుందని చెప్పారు. పాఠశాల విద్యా రంగం అభివృద్ధికి ప్రభుత్వ విధానాలు ఇబ్బందిగా ఉన్నాయని, పేద విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసేలా వైసిపి విధానాలు ఉన్నాయని అన్నారు. వీటన్నిటిని రాబోయే రోజుల్లో రద్దుచేసి మెరుగైన విద్యా విధానాల అమలు చేస్తామని చెప్పారు. యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ఉపాధ్యాయులు మరింత స్ఫూర్తిదాయకంగా పనిచేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, తల్లిదండ్రులతో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండాలని, సామాజిక స్పృహతో పని చేయాలని పిలుపునిచ్చారు.జిపిఎస్‌ రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని, 117 జీవోను రద్దుచేసి 3, 4, 5 తరగతుల విలీనాన్ని నిలిపేయాలని, మున్సిపల్‌ ఉపాధ్యాయులు బదిలీలు, ప్రమోషన్లు వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానాలను ఆమోదించారు.
నూతన కమిటీ ఎన్నిక
యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ పరిశీలకలుగా పల్నాడు జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా కె.శ్రీనివాసరెడ్డి, అధ్యక్షులుగా పి.ప్రేమ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా జి.విజయసారధి, సహాధ్యక్షులుగా ఎ.భాగేశ్వరీదేవి, ఎం.మోహనరావు, కోశాధికారిగా జె.వాల్యా నాయక్‌, కార్యదర్శులుగా వి.నాగేశ్వరరావు, ఎం.రవిబాబు, కె.తిరుపతిస్వామి, సి.హెచ్‌.శ్రీనివాసరావు, ఆర్‌.అజరుకుమార్‌, డి.కాంతారావు, ఎ.నాసరరెడ్డి, షేక్‌ ఆయేషా సుల్తానా, కె.ఉషాశౌరిరాణి, ఎ.శ్రీనివాసరావు, టి.వెంకటేశ్వర్లు, కె.ప్రకాశరావు ఎన్నికయ్యారు.

➡️