బహిరంగ సభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్
ప్రజాశక్తి – ముమ్మిడివరం
వైసిపి ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని టిటిఆర్ నగర్ నుంచి బుధవారం యువగళం ప్రారంభమైంది. తొలుత నూతనంగా నిర్మించిన టిడిపి కార్యాలయాన్ని లోకేష్ ప్రారంభించారు. అనంతరం పెద్ద వంతెన వద్ద టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి దాట్ల సుబ్బరాజు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అవినీతి మయమైన వైసిపి ప్రభుత్వం మరో మూడు నెలల్లో ్ మాడి మసై పోవడం ఖాయమన్నరు. ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబుకి అవినీతి మరక అంటించాలని ప్రయత్నించి భంగపడ్డారన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు చివరికి న్యాయవాదుల పట్లా జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. జగన్‌కి పేదవాళ్లు మంచి ఇంట్లో ఉండటం ఇష్టం ఉండదన్నారు. అందుకే టిడిపి కట్టిన టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు. ఒక పక్క బటన్‌లు నొక్కుతూ మరో పక్క పేదల బతుకులను రోడ్లపైకి లాగుతున్నాడని విమర్శించారు. రాబోయే రోజుల్లో పీల్చే గాలిపైనా పన్నులు వేస్తాడని ఎద్దేవా చేశారు. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలను విస్మరించి మోసం చేశాడన్నారు. అభయహస్తం డబ్బులు రూ.2,500 కోట్లు దొచేశాడన్నారు. జాబ్ క్యాలెండర్‌ను అటకెక్కించాడని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అన్ని ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని, జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నారన్నారు. అవి రైతులకు ఉరితాళ్లు అన్నారు. పోలీసులకు సరెండర్స్, టిఎ, డిఎలు సైతం ఇవ్వట్లేదన్నారు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారన్నారు. ఎంఎల్‌ఎ సతీష్ కుమార్ ముమ్మిడివరాన్ని అవినీతికి అడ్డాగా మార్చేశారన్నారు. ఆయన కలెక్షన్ కుమార్‌గా మారారన్నారు. మత్స్యకారులకు ఇచ్చే నష్టపరిహారంలోనూఆయన వాటాలు వసూలు చేస్తున్నారన్నారు. మత్సకారులకు కేటాయించిన డీజిల్ దారి మళ్లించేస్తూ పెద్దఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. యానాం నుంచిి లిక్కర్ తెచ్చి ముమ్మిడివరంలో అమ్మేస్తున్నారన్నారు. ఈ నాలుగున్నర ఏళ్లలో ఎంఎల్‌ఎ కలెక్షన్ కుమార్ అక్రమార్జన రూ.400 కోట్ల పైమాటేనన్నారు. ఇది వైసిపి నాయకులు, కార్యర్తలే చెబుతున్న మాట అన్నారు. ఎదుర్లంక వద్ద రూ.79 కోట్లుతో గ్రోయిన్ల నిర్మాణానికి 2019లో శంకుస్థాపన చేశారు. అది శిలాఫలకానికే పరిమితమైందన్నారు. 2022 మేలో ఐ. పోలవరం మండలానికి రక్షణ వలయంగా ఉన్న 22 కిలోమీటర్లు ఏటిగట్టు ఆధునికీకరణకు హామీ ఇచ్చి, తర్వాత పట్టించుకోలేదున్నారు. పల్లంకుర్రు-మూలపొలం వంతెన, గోగుల్లంక వంతెన, ముమ్మిడివరం-కాట్రేనికోన రహదారి నిర్మాణాలు శిలాఫలకాలకే పరిమితమయ్యాయన్నారు. రివిట్మెంట్ నిర్మాణాన్ని పూర్తిగా గాలికొదిలేశారన్నారు. టిడిపి హయాంలో అప్పటి ఎంఎల్‌ఎ దాట్ల సుబ్బరాజు రూ.1800 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం టిడిపి ప్రభుత్వం రూ.110 కోట్లు నిధులు కేటాయించిందన్నారు. వైసిపి ప్రభుత్వం దాన్ని నిలిపేసిందన్నారు. వైసిపి ప్రభుత్వంలో దళితులపై దాడు పెరిగిపోయాయన్నారు. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి కొవ్వూరులో మహేంద్ర వరకూ జగన్ పాలనలో దళితులు సమిధలయ్యారన్నారు. అనంతరం ఆయన మహిళలు, యువత, దళితులతో సమావేశాలను నిర్వహించారు. ఆయన వెంట టిడిపి నాయకులు హరీష్‌మాథూర్, దాట్ల సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.