ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిప్రజా పంపిణీ వ్యవస్థపై మరింత నిఘా పెరగనుంది. పేదలకు అందజేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న విషయం విదితమే. దళారులు ప్రజల నుంచి కొనుగోలు చేసిన బియ్యానికి ఇతర దేశాలకు ఎగుమతులు చేయడం, రీ పాలిష్ చేయడం పరిపాటిగా మారింది. తాజాగా బియ్యం ధరలు పెరగడంతో దళారులు రేషన్ బియ్యం కోసం ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో కార్డుదారులకు సరుకుల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలకు దిగింది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ సమాయత్తమైంది. క్షేత్రస్థాయిలో రేషన్ దుకాణాల వారీగా గతంలో ఉన్న ఆహార సలహా కమిటీల స్థానంలో విజిలెన్స్ కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో 870 రేషన్‌షాపుల పరిధిలో మొత్తం 5.73 లక్షల బియ్యం కార్డులున్నాయి. సుమారు 360 ఎండియు వాహనాల ద్వారా కార్డుదారులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. పౌర సరఫరాల శాఖలో జవాబుదారీతనం, సరుకుల పంపిణీలో తలెత్తే ఇబ్బందులు తదితర అంశాలపై పర్యవేక్షణకు గతంలో మండల, డివిజన్, జిల్లాస్థాయిలో ఆహార సలహా కమిటీలు ఉండేవి. ప్రస్తుతం వాటి స్థానంలో ప్రభుత్వం విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేస్తోంది.15 మంది సభ్యులతో విజిలెన్స్ కమిటీమండల, డివిజన్, జిల్లాస్థాయిలో కమిటీలతోపాటు ప్రతి రేషన్ డిపోకూ ఒక కమిటీని నియమిస్తున్నారు. మున్సిపాల్టీలో అయితే కౌన్సిలర్, గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ అధ్యక్షతన ఏర్పాటు చేసే విజిలెన్స్ కమిటీకి సంబంధిత విఆర్‌ఒ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన కమిటీలో ఇద్దరు డ్వాక్రా గ్రూపు సభ్యులు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు, ఐదురుగు కార్డుదారులు, ఐసిడిఎస్ సూపర్‌వైజర్, పౌరసరఫరాల డిటి లేదా ఇన్‌స్పెక్టర్, దివ్యాంగుల నుంచి ఒకరు, సహాయ సాంఘిక సంక్షేమశాఖాధికారి, ఎండియు ఆపరేటర్, ఆ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం ఉంటారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, డివిజన్ స్థాయిలో ఆర్‌డిఒ, మండల స్థాయిలో తహశీల్దార్ చైర్మన్లగా వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులు మూడు నెలలకొకసారి సమావేశమవుతారు. డిపో పరిధిలో కార్డుదారులకు క్షేత్రస్థాయిలో సరుకులు సక్రమంగా పంపిణీ చేస్తున్నారా..? లేదా? అనే అంశాలపై చర్చిస్తారు. మండల కమిటీ నిర్వాహకులు మండలంలోని దుకాణాలు, ఎండియు ఆపరేటర్ల మధ్య సమన్వయంపై ఎప్పటికప్పుడు చర్చించనున్నారు.అక్రమాలకు అడ్డుకట్ట ఏదీ..?జిల్లాలో ప్రతి రెండువారాలకు ఒకసారి భారీగా రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుంటున్నా అక్రమార్కులకు అడ్డుకట్ట పడటం లేదు. కాకినాడ కేంద్రంగా ఉచిత బియ్యాన్ని అక్రమమార్గంలో మిల్లర్లకు తరలిస్తున్నారని, వాటిని పాలిష్ చేసి మళ్లీ బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీన్ని అరికట్టడానికి ప్రజాప్రతినిధులతో నిఘా కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రేషన్ సరుకుల పంపిణీ తీరు, డిపోల సమయపాలన, తూకాల్లో మోసాలను అరికట్టడం, సరుకుల అక్రమ రవాణాను అడ్డుకోవడం కమిటీల బాధ్యతలుగా నిర్దేశించారు. ప్రజాప్రతినిధుల జోక్యం మొదలైతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సరుకుల పంపిణీలో అక్రమాలు జరగుకుండా కమిటీలకు అవగాహన కల్పించడమే కీలకం.