పేదల సంక్షేమానికి పథకాలు: ఎంపిడిఒ

ప్రజాశక్తి-పొదిలి: దేశంలో పేదరిక నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడిఒ శ్రీకృష్ణ అన్నారు. సోమవారం మండలంలోని అక్కచెరువు గురుగుపాడు గ్రామాలలో వికసిత భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమాలు సర్పంచ్‌లు చేరెడ్డి నాగలక్ష్మి, అంబవరపు తిరుపతిరెడ్డిల అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమాలలో వివిధ ప్రభుత్వ అధికారులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం అందించే 17 పథకాల గురించి వాటి అమలు గురించి ప్రజలకు వివరించారు. గ్రామంలో అమలు జరుగుతున్న పథకాలను అర్హులకు వివరించారు. గ్రామ సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ పధకాలు అందకపోతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని వారు సూచించారు. సిడిపిఒ సుధాభారతి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అంగన్‌వాడీల ద్వారా పెరుగుతున్న పిల్లలకు పౌష్టికి ఆహార లోపం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎంఈఒ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక దశలో మంచి తరగతి గదులు విద్యావనరులు సమకూర్చేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ జై శ్రీకాంత్‌, వెలుగు ఏపిఎం మాణిక్యరావు, వ్యవసాయాధికారి ఎస్‌కె జైనులాబ్దిన్‌, వివిధ ప్రభుత్వ అధికారులు పాల్గ్గొనగా గ్రామంలోని విద్యార్థులకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వ్యాస రచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. అనంతరం గ్రామమాలలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న సర్పంచ్‌లను అధికారులు సత్కరించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️