పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయం : ‘గడికోట’

ప్రజాశక్తి – సంబేపల్లె(రాయచోటి) పేదల జీవితాలలో వెలుగులు నింపాలన్నదే సీఎం జగన్‌ ధ్యేయమని వైసిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శనివారం సంబేపల్లె మండలం నారాయణరెడ్డిగారిపల్లె గ్రామ సచివాలయ భవన సముదాయంలో మండలంలోని అసైన్‌మెంట్‌, ఇనామ్‌, డికెటి భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమిలేని నిరుపేదలకు భూ హక్కు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేస్తోందన్నారు. సంబేపల్లె మండలంలో కొత్త డికెటి భూముల పట్టాలు పొందుతున్న లబ్ధిదారులు 277 మందికి 170.91 ఎకరాలు, ఇనాం భూముల పట్టాలు 534 మందికి 492.92 ఎకరాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ పేదలకు భూ పట్టాల పంపిణీతో శాశ్వత ప్రయోజనం కలుగుతోందన్నారు. ఎంపిపి ఆవుల నాగశ్రీ లక్ష్మీ మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమం అభివద్దే జగన్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సర్పంచుల సంఘ జిల్లా అధ్యక్షుడు చిదంబర్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజక వర్గం అన్ని రంగాలలో అభివద్ధి చెందుతోందన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి పొత్తూరి రవీంద్ర నాయుడు, మండల వ్యవసాయ సలహా సంఘ అధ్యక్షుడు వాసుదేవ రెడ్డి, సర్పంచులు మోహన్‌, ముసల్‌రెడ్డి, అంచల రామ చంద్ర, పాల వెంకటరమణ నాయుడు, వెంకట రమణ నాయక్‌, ఎంపిటిసిలు శ్రీధర్‌రెడ్డి, కాకులపల్లె రమణారెడ్డి, నాయకులు మానవత యర్రపురెడ్డి బ్రహ్మా నందరెడ్డి, మాజీ సర్పంచ్‌ శంకర్‌రాజ యాదవ్‌, శివశంకర్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

➡️