ప్రజాశక్తి-గుంటూరు : మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలు ఎదుదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. ఈ మేరకు సిపిఎం ప్రతినిధుల బృందం బుధవారం జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందచేశారు. ఇటీవల మంగళగిరి నియోజకవర్గంలో సిపిఎం పాదయాత్ర సందర్భంగా వచ్చిన ప్రధాన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో గత 50 ఏళ్ల నుండి కమ్యూనిస్టుల పోరాటాల ద్వారా పేదలు ప్రభుత్వ భూముల్లో ఇళ్లు వేసుకొని నివశిస్తున్నారని, సుమారు 20 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు. తాడేపల్లి పట్టణం సుదరయ్య నగర్, కృష్ణనగర్ ప్రాంతాల్లో, మంగళగిరి పట్టణంలోని కొండ చుట్టువున్న ప్రాంతం, రత్నాల చెరువు తదితర ప్రాంతాల్లో, ఆత్మకూరు నిమ్మగడ్డ రామ్మోహనరావు నగర్, వైసిపి కాలని, కాజ గ్రామంలోని పుల్లయ్య నగర్, తాడేపల్లి రూరల్ మండలంలోని వడ్డేశ్వరం, రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నిడమర్రు గ్రామాల్లో వేలాది మంది పేదలు ఇళ్లేసుకుని నివాసముంటున్నారని, వారందరికీ పట్టాలు ఇవ్వాలని కోరారు. నియోజకవర్గంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. నిర్మాణాలు పెరుగుతున్న నేపథ్యంలో తాడేపల్లి-మంగళగిరి కార్పోరేషన్ పరిధిలో ప్రణాళికా బద్ధమైన డ్రెయినేజీ వ్యవస్థ అవసరమని చెప్పారు. ఎస్సీ కాలనీలకు శ్మశానాల సమస్య తీవ్రంగా ఉందని, ఆత్మకూరు, చిర్రావూరు తదితర గ్రామాలలో శ్మశాన స్థలాల్లేక ఇబ్బందులున ఎదుర్కోంటున్నారని, సత్వరమే శ్మశాన స్థలాలు కేటాయించాలని కోరారు. గ్రామాల్లో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వాటిని బాగు చేయించాలని కోరారు. పెదకాకాని సుందరయ్య నగర్ కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌కు సిపిఎం నాయకులు వినతిపత్రం ఇచ్చారు. 2007 నుండి పేదలు అసైన్డ్ భూముల్లో ఇళ్లేసుకుని నివాసముంటున్నారని, గతంలో అనేక సార్లు దశల వారీగా ఆందోళన చేసినా ఇళ్ల పట్టాలివ్వలేదని గుర్తు చేశారు.మాస్టిన్ సామాజిక తరగతుల వారికి కుల ధ్రువపత్రాల మంజూరులో జాప్యం జరుగుతోందని, వెంటనే వచ్చేచట్లు చూడాలని కోరారు. పెదవడ్లపూడి హైలెవల్ ఛానల్‌కు నిధులు కేటాయించి, పూర్తి చేయాలని, 80 శాతం పూర్తయినా ప్రభుత్వం వినియోగంలోకి తీసుకరాలేక పోయిందని, ఫలితంగా 25 వేల ఎకరాలకు నీటి కొరత ఏర్పడుతోందని చెప్పారు. నియోజకవర్గంలో పిడబ్ల్యూడి కట్టలపై ఇళ్లేసుకుని నివాసముంటున్న పేదలకు అక్కడే ఇళ్ల పట్టాలివ్వాలని, లేదా ప్రత్యామ్నాయ స్థలాలు చూపి ఇళ్ల నిర్మాణం చేసిన తరువాతే నోటీసులివ్వాలని కోరారు. వీటిపై కలెక్టర్ స్పందిస్తూ అభ్యంతరం లేని భూముల్లో ఇళ్లేసుకుని నివాసముంటున్న పేదలకు పట్టాలు మంజూరు చేస్తామన్నారు. నియోజకవర్గంలో ప్రణాళికాబద్ధమైన డ్రెయినేజీ వ్యవస్థ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతామని, తమ పరిధిలోని సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని చెప్పారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో నాయకులు ఇ.అప్పారావు, ఎస్‌ఎస్.చెంగయ్య, జె.వి.రాఘవులు, జె.బాలరాజు, కరుణాకర్, బర్నబాసు, వి.వెంకటేశ్వరరావు, బి.కోటేశ్వరి, బి.శ్రీనివాసరావు, కె.అజరుకుమార్, బి.లక్ష్మణరావు, కె.నాగేశ్వరరావు, ఎన్.శివాజి, ఎం.భాగ్యరాజు, దుర్గారావు ఉన్నారు.