పేదలకు అండగా ప్రభుత్వం : కలెక్టర్‌

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : పేద కుటుంబాలలోని ఆడపిల్లల పెళ్లి ఖర్చు తల్లిదండ్రులకు భారం కాకుండా గౌరవంగా వివాహం జరిపించేలా ఆర్థిక సహాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ తెలిపారు. ‘వైఎస్‌ఆర్‌ కల్యాణమసు ్త- వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా’ పథకం భాగంగా నాలుగో విడత లబ్దిదారులకు ఆర్థిక సహాయం అందజేసే కార్యమపై తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్‌, జడ్‌పి చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నగర పాలక సంస్థ మేయర్‌ గంగాడ సుజాత పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు బ్యాంకు చెక్కును అందించి వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మట్లాడుతూ పేద కుటుంబాలలో బాల్య వివాహాలను నివారించడంతోపాటు ఆడపిల్ల పెళ్లి ఖర్చు తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. నాలుగో విడతలో జిల్లాలో 593 మందికి (వీరిలో 23 మంది కులాంతర వివాహాలు చేసుకున్నారు) రూ.4,91,65, 000 లబ్ధి కలిగిందన్నారు. ఈ నాలుగు విడతలలో కలిపి 1572 మందికి రూ.12,93,30,000 ల ఆర్థిక ప్రయోజనం కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ మెప్మా పీడీ టి.రవికుమార్‌, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మా నాయక్‌, జిల్లాబీసీ సంక్షేమ అధికారి అంజల, మైనార్టీ సంక్షేమ అధికారి సురేష్‌ కన్నా, సచివాలయాల నోడల్‌ ఆఫీసర్‌ ఉషారాణి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా తెలిపారు. వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా పథకం లబ్ధిదారులకు కలెక్టరేట్‌ లోని స్పందన సమావేశ మందిరంలో గురువారం నగదు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వర్చువల్‌ విధానంలో బట్టన్‌ నొక్కి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కు రూపంలో నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆడపిల్లలో అక్షరాస్యతను మరింత పెంచడానికి కళ్యాణమస్తు పథకాన్ని ప్రభుత్వం స్వల్ప మార్పు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో గడచిన త్రైమాసంలో వివాహాలు చేసుకున్న నవ దంపతులకు ప్రభుత్వం నగదు పంపిణీ చేసిందన్నారు. 219 ఎస్‌సి జంటలు, 17 ఎస్‌టి జంటలు, 41 బీసీ -ఏ జంటలు, 50 బిసి -బి జంటలు, 29 బిసి-డి జంటలు, 25 బిసి-ఇ జంటలు, 8 ఒసి జంటలు, రెండు వికలాంగ జంటలు, ఒక భవన నిర్మాణ రంగ కార్మికుల జంటకు కలిపి మొత్తం 392 జంటలకు రూ.3.38 కోట్లు లబ్ధిదారుల తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు తెలిపారు. నవ దంపతులు తమ కుటుంబ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ అర్జున్‌ రావు, ఎస్‌సి సంక్షేమ సాధికారత అధికారి జె. రాజదిబోరా, కలెక్టరేట్‌ ఎఒ గోపికష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️