ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్ : పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులను అరికట్టాలని ఆవాజ్ ఒంగోలు నగర కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక గాంధీ నగర్‌లో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆవాజ్ నాయకులు ఎస్‌డి. హుస్సేన్ అధ్యక్షత వహించారు. ఈ సంద ర్భంగా సిపిఎం ఒంగోలు నగర కార్యదర్శి జి.రమేష్ మాట్లాడుతూ పాలస్తీనాపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ భారత్ ప్రభుత్వం పూర్తి మద్దతు తెలపాలన్నారు. అమెరికా సామ్రాజ్యవాద దేశాలు దాడులను ప్రోత్సహిస్తున్నాయన్నారు. పాలస్తీనా ప్రజలకు కనీస సౌకర్యాలు నిలిపి వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పాలస్తీనాపై జరుగుతున్న దాడులను ఖండించాలన్నారు. ఐక్యరాజ్య సమితి లోనూ పాలస్తీనాకు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. ఆవాజ్ జిల్లా నాయకుడు ఎమ్‌డి. యాసిన్ మాట్లాడుతూ పాలస్తీనాలో ప్రజల ఎదుటే దాడులు నిర్వహించడం దుర్మార్గమన్నారు. పిల్లలు మహిళలు భయానికి గురవుతున్నారు, చర్చిలు, మసీదులను లక్ష్యంగా చేసుకొని మహిళలు, పిల్లలపై దాడులు చేయటం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తంబి శ్రీనివాసులు ఎస్‌కె. హరికృష్ణ, టి.దాసు , షేక్ జాన్ బాషా , విశ్రాంత మున్సిపల్ కమిషనర్ షేక్ నబీ సాహెబ్, ముస్లిం ప్రజాసంఘాల నాయకులు ఎస్‌కె.అబ్దుల్లా, ఎమ్‌డి. సలీం, రియాజ్, షేక్ సైదా, రెహ్మాన్ పాల్గొన్నారు.