ప్రజాశక్తి-కడప బద్వేలు నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివద్ధి చేసి ఆ ప్రాంతంలో పేదరికాన్ని నిర్మూలించే దిశగా ప్రభుత్వం అభివద్ధికి బాటలు వేస్తుందని కలెక్టర్ వి.విజరు రామరాజు తెలిపారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలోని గోపవరం మండలంలో మైక్రో, స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద 68.49 ఎకరాల్లో నూతనంగా ఏర్పాటు చేయ తలపెట్టిన ఇండిస్టియల్ ఎస్టేట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన ్‌మోహన్‌రెడ్డి వర్చువల్ విధానం ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి కలెక్టర్ వి.విజరు రామరాజుతో పాటు బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, కుడా చైర్మన్ గురు మోహన్, ఎపిఐఐసి డైరెక్టర్ గోపవరం ప్రభాకర్‌రెడ్డి, ఎపిఐఐసి కడప జెడ్‌ఎం కె.శ్రీనివాస మూర్తి హాజరయ్యారు. వర్చువల్ ద్వారా ముఖ్యమంత్రి కార్యక్రమం ముగిసిన అనంతరం బోర్డు మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన నూతన ఇండిస్టియల్ ఎస్టేట్‌కు సంబందించిన శిలాఫలకాన్ని కలెక్టర్ ముఖ్య అతిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైక్రో, స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కింద జిల్లాలోని గోపవరం మండలంలో 68.49 ఎకరాల్లో ఏర్పాటవుతున్న నూతన ఇండిస్టియల్ ఎస్టేట్ అభివద్ధి కోసం ప్రభుత్వం రూ.15.25 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదం తెలిపారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడి భాగస్వామ్యంతో ఏర్పాటు కానున్న ఈ నూతన ఇండిస్టియల్ ఎస్టేట్ అభివద్ధికి ఎంఎస్‌ఇ-సిడిపి ద్వారా రూ.10.50 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులను, రూ.4.75 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులను వెచ్చించనున్నట్లు తెలిపారు. గోపవరం నూతన ఇండిస్టియల్ ఎస్టేట్ అభివద్ధిలో భాగంగా అంతర్గత రోడ్లకు రూ.8.65 కోట్లు, వర్షపు నీటి డ్రైనేజీల కోసం రూ.4.29 కోట్లు, విద్యుత్ సరఫరాకు గాను రూ.2 కోట్లు, అత్యవసర ముందస్తు వైద్య సదుపాయాలకు గాను రూ.30 లక్షలు కలిపి మొత్తం రూ.15.25 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో వందలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందనున్నాయన్నారు. ఇప్పటికే జిల్లాలో గోపవరం, కోప్పర్తి, పులివెందులలో నూతన పరిశ్రమల స్థాపనతో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అందుతోందన్నారు. రాబోయే రోజుల్లో గోపవరం పారిశ్రామిక వాడ ద్వారా బద్వేలు నియోజకవర్గం మరింత అభివద్ధి పథంలోకి రానుందన్నారు. సెంచరీ ఫ్లై పరిశ్రమ ద్వారా గోపవరం ప్రాంతం ఇప్పటికే పారిశ్రామిక గుర్తింపును పొందిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన పరిశ్రమల స్థాపనతో జిల్లాలో వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు జిల్లాను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా కషి చేస్తోందని పేర్కొన్నారు.