ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అందని వైద్య సేవలు
పురుగుల మందు తాగిన రోగుల పరిస్థితి దారుణం
విజయవాడకు రిఫర్, లేదంటే జనరల్ వార్డుకు తరలింపు
అత్యవసర వైద్యం అవసరమైనా ఐసియుకి తరలించని పరిస్థితి
రోగి బంధువులు నిలదీస్తేనే ఐసియుకి సిఫార్సు
అప్పటికే చేజారుతున్న ప్రాణాలు
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
ఏలూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగుల పట్ల నిర్లక్ష్యం తాండవిస్తోంది. ముఖ్యంగా పురుగుల మందు (పాయిజన్) తాగిన రోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం కారణంగా రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా ఆసుపత్రిగా ఉండగా ఉత్తమ సేవలందించిన ఏలూరు ప్రభుత్వాసుపత్రి మెడికల్ కాలేజీగా మారిన తర్వాత రోగులకు సరైన వైద్యం అందించని దుస్థితి ఏర్పడిందనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. సీనియర్ డాక్టర్లు ఇక్కడ నుంచి వెళ్లిపోవడం, వచ్చిన వారు రోగుల పట్ల బాధ్యతగా వ్యవహరించడం లేదనే చర్చ రోగుల్లో నెలకొంది. దీంతో ఒకప్పుడు ప్రతిరోజూ దాదాపు 1500కుపైగా ఉండే ఓపి సేవలు ప్రస్తుతం తగ్గిపోయాయని చెబుతున్నారు. ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ప్రతిరోజూ వందల సంఖ్యలో రోగులు వైద్యం కోసం వస్తుంటారు. ముఖ్యంగా పురుగులమందు తాగిన కేసులు జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికే వస్తుంటాయి. స్థానికంగా ఉన్న ఏ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినా పాయిజన్ కేసులను ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికే పంపిస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం వైద్యం అందకుండా పోతోంది. పురుగుల మందు తాగిన రోగికి ప్రథమ చికిత్సగా తాగిన మందును కక్కిస్తారు. తర్వాత అత్యవసర వైద్యం అందించాల్సి ఉంటుంది. ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మాత్రం అందుకు భిన్నంగా నడుస్తోంది. ప్రాథమిక చికిత్స పూర్తయిన తర్వాత అత్యవసర వైద్యం అందాలంటే ఐసియుకి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ అలా జరగడం లేదు. ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత విజయవాడ తీసుకెళ్లాలంటూ రోగుల బంధువులను భయపెడుతున్నారు. మాట వినకుంటే జనరల్ వార్డుకు పంపించి సాధారణ రోగుల మాదిరిగానే పరిగణిస్తున్నారు. పాయిజన్ తీసుకున్న కేసులో రోగి పరిస్థితి గంటగంటకూ మారుతోంది. అత్యవసర వైద్యం అందించకుండా జనరల్ వార్డులో ఉంచడం ఏమిటని రోగి బంధువులు నిలదీస్తున్న ఘటనలు కోకొల్లలు. రోగుల బంధువులు నిలదీసిన తర్వాతే ఐసియుకి పంపిస్తుండటం గమనార్హం. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని రోగుల బంధువులు చెబుతున్నారు. ఏలూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఐసియు విభాగం పటిష్టంగా ఉంది. అక్కడ పని చేస్తున్న డాక్టర్లు మంచి వైద్యం అందిస్తారనే నమ్మకం రోగులకు సైతం ఉంది. అయితే అత్యవసర వైద్యం అవసరమైన పాయిజన్ కేసులను వెంటనే ఐసియుకి ఎందుకు పంపడం లేదో ఏ ఒక్కరికీ అర్థం కావడం లేదు. పురుగులమందు తాగిన వ్యక్తి తిరిగి కోలుకోవడం కొంచెం కష్టమై ఉండొచ్చు. అలాగని అత్యవసర వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై రోగుల బంధువులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అత్యధిక కేసులను విజయవాడకు రిఫర్ చేస్తున్నారనే అపవాదు ఇప్పటికే ఏర్పడింది. ఆసుపత్రిలో వైద్య సదుపాయాల అందజేతపై సరైన పర్యవేక్షణ లేకపోవడం కారణంగానే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఎంతోమంది పేదలు ప్రతిరోజూ ఏలూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వస్తుంటారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి సారించి సరైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.