ప్రజాశక్తి – పోలవరం
మండలంలోని గూటాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1976-1977 విద్యా సంవత్సరంలో 10వ తరగతి వరకు చదివిన పూర్వ విద్యార్థులు సోమవారం రూ.లక్షా 16 వేల 116 విరాళంగా పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ మేము ఎన్నో రంగాలలో స్థిరపడ్డామని, చదువు విలువ తెలిసిన వాళ్లమని, తాము చదువుకున్న బడి రుణం తీర్చుకోవాలనే సంకల్పం చేసుకొని అందరం డబ్బులు సేకరించామని తెలిపారు. ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు ఆర్థికంగా వెనుకబడిన వాళ్లు ఉంటారని, తాము చదువుకున్న పాఠశాల విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించడం ద్వారా పిల్లల్లో పోటీతత్వం పెంచి తద్వారా వారి భవిష్యత్తుకు బాటలు వేయాలనే సంకల్పంతో 1976-77 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు డోకలనాగేశ్వరరావు, కూనల ఆదినారాయణ, మానూరి మాలతి, షేక్ మీరావాలి, మిరియాల వెంకటేశ్వరరావు, మిగిలిన వారందరి సహకారంతో పిల్లల కోసం లక్షా పదహారు వేల నూటపదహారు రూపాయల విరాళం ప్రకటించారు. దీనిని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీని పిల్లలకు ప్రోత్సాహంగా అందజేయాలని కోరారు. ఈ చెక్కును ప్రధానోపాధ్యాయులు కెవి.రాఘవన్‌కు అందించారు. ఈ విరాళాన్ని అందజేయడం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ అభినందనలు తెలియజేశారు.