పరిశ్రమల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత

పరిశ్రమల ఏర్పాటు

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత పేర్కొన్నారు. తాడేపల్లి నుంచి ఎమ్‌ఎస్‌ఇ-సిడిపి నిధులతో రూ.20.64 కోట్ల అంచనా విలువతో కలవచర్లలో చేపట్టనున్న నూతన పారిశ్రామికవాడకు ముఖ్యమంత్రి వై.యస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి వర్చువల్‌గా బుధవారం శంఖుస్థాపన చేశారు. స్థానిక కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌, ఎంఎల్‌ఎలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, డిసిసిబి చైర్మన్‌ ఆకుల వీర్రాజు ఇతర ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కె.మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశ్రమల ఏర్పాటు, వాటికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన కార్యాచరణ ప్రణాళికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాల్లో పారిశ్రామిక అభివద్ధి క్లస్టర్ల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో ఎపి ఇండిస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (Aూ××జ) లిమిటెడ్‌ కోసం రూ.2,065 లక్షల అంచనాతో మంజూరైన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పారిశ్రామిక అభివద్ధి ప్రాజెక్ట్‌ కలవచర్లలో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదికను సంబంధిత అంచనా వ్యయంతో ప్రధాన కార్యాలయానికి సమర్పించినట్టు చెప్పారు. ఎంఎస్‌ఇ- సిడిపి కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌ రూ.1050 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం/ ఎపిఐఐసి గ్రాంట్‌ రూ.1,015 లక్షలతో ఈ ప్రాజెక్ట్‌ ప్రతిపాదించినట్టు చెప్పారు. అంతర్గత రహదారులు, మురుగునీరు పారుదల వ్యవస్థ, ముందస్తు నిర్వహణ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రాజానగరం ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా మాట్లాడుతూ సిఎం వైఎస్‌.జగన్‌ నేతత్వంలో నాలుగున్నరేళ్లుగా సంక్షేమం, అభివృద్ధి, అవినీతి రహిత పాలన దిశగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రాభివద్ధి కోసం పారిశ్రామిక ప్రగతి లక్ష్యంగా సంబంధిత పరిశ్రమలు ఏర్పాటు చేసే ఔత్సాహితులను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నారన్నారు. కలవచర్లలో 104 ఎకరాలు విస్తీర్ణంలో ఇండిస్టియల్‌ ఎస్టేట్‌ ఏర్పాటుకు నిధులు సమకూర్చడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా నేడు సిఎం శంకుస్థాపన చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్‌ సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి, ఎంపిపి ఎం.వీర్రాజు, జిల్లా పరిశ్రమల అధికారి బి.వేంకటేశ్వర రావు, ఎపిఐఐసి డిప్యూటీ జోనల్‌ మేనేజర్లు డివిఎస్‌ఎన్‌ జ్యోత్స్నాదేవి, బి.రాధామణి, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

➡️