ప్రజాశక్తి-యర్రగొండపాలెం : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు సాగు కాలేదు. వ్యవసాయ కూలీ పనులు కరువయ్యాయి. చేసేదేమీ లేక కూలీలు, రైతు కుటుంబాలు తెలంగాణలోని హైదరాబాదు, కల్వకుర్తి, నల్గొండ, జనగామ, సంగారెడ్డి, సదాశివపేట, వరంగల్, జడ్చర్ల, నాగర్ కర్నూల్, ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలోని మాచర్ల, దుర్గి, గురజాల, సత్తెనపల్లి, చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు బతుకు తెరువు కోసం వలసబాట పడుతున్నారు. గత 20 రోజుల నుంచి వలసలు అధికమయ్యాయి. యర్రగొండపాలె, మురారిపల్లి, గోళ్లవిడిపి, అయ్యంబొట్లపల్లి, గంగాపాలెం, నరసాయిపాలెం, మొగుళ్లపల్లి, వీరభద్రాపురం, గంజివారిపల్లి, కొలుకుల, తమ్మడపల్లి, అమానుగుడిపాడు, బోయలపల్లి గ్రామాల నుంచి వాహనాల్లో పిల్లాపాపలతో కలిసి మూట ముల్లె సర్దుకుని వలసలు వెళ్తున్నారు. ప్రతిరోజూ ఒక్కో గ్రామం నుంచి 20 కుటుంబాల వారు వలస పోతున్నారు. దీంతో గ్రామాల్లోని వీధులన్నీ జన సంచారం లేక బోసిపోయాయి. ఇప్పటికైనా అధికారులు ఉపాధి పనులు చూపించి వలసలను నివారించాలని ప్రజలు వాపోతున్నారు.