పత్తి రైతు చిత్తు!

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పత్తి సాగులోనూ రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాలు నాటిప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకూ సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. దిగుబడి వచ్చినా తగిన ధర ఉండటం లేదు. ఈ ఏడాది వర్షాభావం వల్ల దిగుబడి గణనీయంగా తగ్గుతోంది. వాతావరణం బాగా అనుకూలిస్తే 10 నుంచి 12 క్వింటాళ్ల సగటు దిగుబడి సాధించే అవకాశం ఉన్నా ఈ ఏడాది మాత్రం 5-7 క్వింటాళ్లు వస్తే గొప్పగా రైతులు చెబుతున్నారు. పల్నాడు జిల్లాలో 1.55 లక్షల ఎకరాలు, గుంటూరు జిల్లాలో 45 వేల ఎకరాల్లో పత్తి సాగైంది. అక్టోబరులో వర్షాలు లేకపోవడం, 21 రోజలపాటు వేడిగాలులు ఉండటంతో పైర్లు బెట్టకొచ్చి నీటికోసం తపించాయి. కాల్వలకు నీరు విడుదల చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో పత్తి పైరుకు గులాబి పురుగు, ఇతర పేనుబంక తెగుళ్లు ఎక్కువగా ఆశించాయి. వారం రోజులుగా వర్షాలు కురస్తుండటం, ముసురు పట్టడం వల్ల ఈ తెగుళ్లు మరింతపెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే తెగుళ్ల ధాటికి మొక్కల ఆకులు, కొమ్మలు పురుగులు తీనేస్తున్నాయి. ఒకవైపు వర్షాభావంతో పైరు ఎదుగుదల తగ్గుతుండగా తెగుళ్లు దాటికి మరింత నష్టం జరుగుతోంది. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవక పత్తిసాగులో తీవ్ర జాప్యమైంది. ప్రధానంగా పల్నాడు జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో నాలుగు నెలల కాలంలో ఏ నెలలోనూ చాలినంత వర్షం కురవలేదు. దీంతో పైరు ఎదుగుదల కూడా ఆశించినంతగా లేదు. ఈ ప్రభావం దిగుబడిపైనా పడింది. మొదటి విడత పత్తి తీతలు దాదాపుగా ముగిశాయి. వర్షాభావం వల్ల రెండో విడత పూత, కాయలు చాలా తక్కువగా కన్పిస్తున్నాయి. దీనికి తోడు తెగుళ్ల ప్రభావం కూడా పైర్లను వెంటాడుతోంది. దీంతో రైతులకు అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాళ్‌ రూ.7020 ఉండగా ఇప్పటి వరకు రైతుల నుంచి ప్రైవేటు వ్యాపారులు క్వింటాళ్‌ రూ.6 వేలకు మించి కొనుగోలు చేయడం లేదు. గతేడాది క్వింటాళ్‌ రూ.6380 కనీస మద్దతు ధర కాగా గరిష్టంగా రైతుల వద్ద నుంచి రూ.5500కి మించి కొనుగోలు చేయలేదు. రైతుల వద్ద నుంచి దళారుల వద్దకు చేరగానే ధరలు క్వింటాళ్‌కు రూ.7 వేల నుంచి రూ.8 వేలకు పెంచారు. చాలా కాలంగా పత్తిసాగుకు అలవాటుపడిన వారు ఈ ఏడాది కూడా ఇదేబాటలో పయనించారు. గతేడాది కంటే విస్తీర్ణం తగ్గినా ధరలు పెరుగుతాయని ఆశించిన రైతులకు నిరాశ ఎదురైంది. ప్రతి ఏటా ప్రభుత్వం కనీస మద్దతు ధర సగటున 10 శాతం పెంచుతున్నా రైతులకు గతేడాది ధర కంటే తక్కువగానే దక్కుతోంది.

➡️