పకడ్బందీగా ప్రధాని పర్యటన ఏర్పాట్లు

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమావేశం

పకడ్బందీగా ప్రధాని పర్యటన ఏర్పాట్లుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ రెండు రోజుల తిరుమల, తిరుపతి పర్యటన సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 26, 27 తేదీలలో తిరుపతి జిల్లాకు విచ్చేయనున్నారని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌ లో భారత ప్రధాన మంత్రి తిరుపతి జిల్లా పర్యటన నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లపై వివిధ శాఖల సమన్వయ సమావేశాన్ని జిల్లా కలెక్టర్‌ ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి, జె.సి డి కె బాలాజీ, జేఈఓ వీరబ్రహ్మం, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌ హరిత, జిల్లా రెవెన్యూ అధికారి, ఆర్డీవోలు, అదనపు ఎస్పీలు, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన సాయంత్రం 6.55 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి ప్రధాని నరేంద్రమోదీ చేరుకుంటారని, అనంతరం రోడ్డు మార్గాన తిరుమల చేరుకొని రాత్రి బస చేసి మరుసటి దినం 27న ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని రేణిగుంట విమానాశ్రయం నుండి ఉదయం 10:25 గంటలకు తిరుగు ప్రయాణం కానున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్టు డాక్టర్లు ఏర్పాటు, అధునాతన లైఫ్‌ సపోర్ట్‌ అంబులెన్స్‌, 108, సేఫ్‌ రూమ్‌, తదితరాలు ఏర్పాటు ఉండాలని సూచించారు. అలాగే ఫైర్‌ సేఫ్టీ, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు, విద్యుత్‌ శాఖ నిరంతర విద్యుత్‌ ఏర్పాటు, తగినంత లైటింగ్‌, రవాణా శాఖ వాహనాల ఫిట్నెస్‌ చెక్‌, కమ్యూనికేషన్‌ ప్లాన్‌ ఇంటర్నెట్‌ టెలిఫోన్‌ సదుపాయాలు, పోలీసు శాఖ ద్వారా పటిష్ట బందోబస్తు ఏర్పాటు ఉండాలని, శానిటేషన్‌ ఏర్పాట్లు సంబంధిత అధికారులు పక్కాగా ఉండేలా చూడాలని, అవసరమైన చోట బారికెడింగ్‌, రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. భారత ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్‌ రానున్నారని వాటికి సంబంధించిన ఏర్పాట్ల కొరకు అధికారులకు విధులు కేటాయించాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రధాని పర్యటన విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బందోబస్తు ఏర్పాట్లను రేణిగుంట విమానాశ్రయం మొదలుకొని, భారత ప్రధాని పర్యటించు అన్ని ప్రాంతాలలో తగినంత పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు కులశేఖర్‌, వెంకటరావు, రాజేంద్ర, ఆర్డిఓలు నిశాంత్‌ రెడ్డి, కిరణ్‌ కుమార్‌, చంద్రముని, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు శ్రీనివాసులు, కోదండరామిరెడ్డి, శ్రీనివాసులు, భవాని, ప్రోటోకాల్‌ డిప్యూటీ కలెక్టర్‌ భాస్కర్‌ నాయుడు, ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ బసవరాజ పాల్గొన్నారు.ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమావేశం

➡️