పంటకు నష్టం లేకుండా చర్యలు చేపట్టాలి

Nov 30,2023 23:00
సంక్షేమ పథకాలను

ప్రజాశక్తి – కాకినాడ

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయ పంటలు దెబ్బతినకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, రైతులను అప్రమత్తం చేయాలని జడ్‌పి ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయ సమావేశ హాలులో గురువారం జడ్‌పి ఏడు స్థాయి సంఘాల సమావేశాలు ఆయా సంఘాల చైర్‌పర్సన్ల అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశాలకు ఆయా స్థాయీ సంఘాలలో సభ్యులైన జడ్‌పిటిసి సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, జిల్లా అధికారులు, అయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశాలలో పలు అంశాలను చర్చించి ఆమోదించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గల వివిధ అభివృద్ధి పథకాలపై సమీక్ష నిర్వహించి ఆర్థిక, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, రహదారులు, విద్య, వైద్యం, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, జగనన్న స్వచ్ఛ సంకల్పం, జాతీయ ఉపాధి హామీ పథకం, హౌసింగ్‌, విద్యుత్‌, గ్రామీణ అభివద్ధి తదితర అంశాలలో ఇప్పటివరకు జరిగిన పురోగతి, కొత్తగా ప్రతిపాదించిన పనుల వివరాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జడ్‌పి ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ తుపాన్‌ కారణంగా పంటలు దెబ్బ తినకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సీజనల్‌ వ్యాధులపై వైద్యాధికారులు అప్రమత్తతతో వ్యవహరించి గ్రామ స్థాయిలో పారిశుధ్య కార్యక్రమాలు పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారులు, పంచాయతీరాజ్‌, వ్యవసాయం, విద్యా, సంక్షేమం తదితర అంశాలపై చర్చించి, సభ్యులు తీర్మానాలు చేశారన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యహరిస్తూ అభివద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమలుచేయనున్నట్లు వేణుగోపాలరావు తెలిపారు. ఈ సమావేశంలో జడ్‌పి సిఇఒ ఎ.రమణారెడ్డి, ఆయా జిల్లాల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

➡️