ప్రజాశక్తి-గుంటూరు: ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు సెక్టార్ ఆఫీసర్ల పాత్ర ఎంతో ముఖ్యమని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో సెక్టార్ ఆఫీసర్లు, సెక్టార్ పోలీసు ఆఫీసర్లకు జరిగిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో సెక్టార్ అధికారుల పాత్ర కీలకమన్నారు. సెక్టార్ అధికారులు నిర్వహించాల్సిన విధులకు సంబంధించి భారత ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్‌ను క్షుణ్ణంగా చదివి ఆ మేరకు విధులు నిర్వహించాల్సి వుంటుందని చెప్పారు. ఒక్కొక్క సెక్టార్ ఆఫీసర్ పరిధిలో 10 నుండి 12 పోలింగ్ స్టేషన్లు ఉంటాయని, వారి పరిధిలోని పోలింగ్ స్టేషన్లలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలూ లేకుండా ఓటింగ్ వేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. వారి పరిధిలోని ప్రతి పోలింగ్ స్టేషన్‌ను తప్పక భౌతికంగా పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. సెక్టార్ పరిధిలోని బిఎల్‌ఓలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అవసరమైన ఏర్పాట్లను చేపట్టాల్సి ఉంటుందన్నారు. వాలంటీర్ల సేవలు నిషిద్ధమని స్పష్టం చేశారు. సెక్టార్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుండి ఎన్నికల విధుల్లో చాలా అప్రమత్తంగా వుండి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా బాధ్యతలు నిర్వహించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారుల పాత్ర, సెక్టార్ అధికారులు చేయాల్సినవి, చేయకూడని అంశాలపై పొన్నూరు తహశీల్దార్ శ్రీకాంత్ వివరించారు. కార్యక్రమంలో జిఎంసి కమిషనర్ కీర్తీ చేకూరి, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలిశర్మ , అడిషనల్ ఎస్పీ సుప్రజ, డీఆర్‌ఓ కె.చంద్రశేఖరరావు, డీఆర్డీఏ, డ్వామా పీడీలు హరిహరనాథ్, వెంకటశివరామిరెడ్డి, ఆర్డీఓ పి.శ్రీఖర్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ప్రభాకరరెడ్డి, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్లు , నోడల్ అధికారులు పాల్గొన్నారు.