నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ : ఎస్‌పి

ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌

జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీస్‌ వ్యవస్థ ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తుందని సిబ్బంది విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని జిల్లా ఎస్‌పి డి.మేరీప్రశాంతి అన్నారు. ఏలూరులోని పోలీస్‌ ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో నెలవారీ నేర సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం సబ్‌ డివిజన్‌ పరిధిలో సిఐలు, ఎస్‌ఐలు ఈ కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. జిల్లాలో నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. మహిళలపై నేరాలను నిరోధించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచించారు. బాలికల మిస్సింగ్‌ కేసుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఆచూకి తెలుసుకునేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం ఎస్‌పి మాట్లాడుతూ నేరాలకు పాల్పడిన నిందితులకు సత్వరం శిక్ష పడేలా పోలీస్‌ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. బాధితులకు న్యాయం జరిగేలా సంఘటనా స్థలాన్ని పరిశీలించడం, సాక్ష్యాధారాల సేకరణ, నిందితుల అరెస్టు, దర్యాప్తు, ఛార్జీషీటు దాఖలు, కోర్టులోసాక్షులను ప్రవేశపెట్టడంలో పోలీస్‌ సిబ్బంది తమ ప్రతిభను చాటుకోవాలని చెప్పారు. సివిల్‌ కేసుల్లో పోలీసులు చట్టం మేరకు మాత్రమే తమ పాత్ర పోషించాలని ఆదేశించారు. రౌడీషీటర్లపై నిఘా పెంచడంతో పాటువారిలో పరివర్తన తీసుకువచ్చేందుకు అవగాహన కల్పించాలని చెప్పారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రజల సమస్యలను సానుకూలంగా విని చట్టపరిధిలో బాధితులకు న్యాయం చేయాలన్నారు. పోలీస్‌ సిబ్బంది అవినీతి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, పోలీస్‌ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. ఎస్‌ఇబి ఆధ్వర్యంలో జిల్లాలోని నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ ఉండాలని ఆదేశించారు. గంజాయి, మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకోవాలని చెప్పారు. మద్యం అక్రమ రవాణా, సారా విక్రయాలు, ప్రభుత్వం నిషేధించిన ఖైనీ, గుట్కాల విక్రయాలపై కఠిన చర్యలు చేపట్టాలని ఎస్‌పి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో డిసిఆర్‌బి సిఐ ఎం.సుబ్బారావు, దుర్గాప్రసాద్‌, ఏలూరు డిఎస్‌పి ఇ.శ్రీనివాసులు, జంగారెడ్డిగూడెం డిఎస్‌పి ధనుంజయుడు ఉన్నారు.

➡️