ప్రజాశక్తి – తాళ్లరేవు, ముమ్మిడివరంరాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి చేతగాని పాలన కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం నష్టాల ఊభిలో కూరుకుపోతుంది టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. 213వ రోజు యువగళం పాదయాత్ర గురువారం సుంకరపాలెం క్యాంపు సైటు నుంచి ప్రారంభమైంది. లోకేష్‌ను పటవల గ్రామ రైతులు ఈ సందర్భంగా కలిశారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. నాలుగున్నరేళ్లుగా వ్యవసాయ పంటలకు మద్దతు ధర లభించట్లేదని ఆయన వద్ద వాపోయారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉందన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీలు, పంటల బీమా పథకాలను వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. అధికారంలోకి వస్తే రైతులందర్నీ ఆదుకుంటామన్నారు. అన్నదాత పథకం కింద ప్రతి రైతుకూ ఏటా రూ.20వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. మధ్యాహ్నం కోరంగిలో శెట్టిబలిజ సామాజికవర్గం ప్రతినిధులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. లచ్చిపాలెం గ్రామస్తులు కలిసి సమస్యలను ఏకరువు పెట్టారు. ఇంజరం రోడ్డులో వంతెన తూరల్లో చెత్త పేరుకుపోవడం వల్ల సాగునీరు అందక 13 గ్రామాలు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై జగన్ స్పందించారు. జగన్ అండ్ కోకు అడ్డగోలు దోపిడీపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదన్నారు. కనీసం కాలువల పూడిక కూడా తీయలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం శోచనీయమన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఇంజరం వంతెన నిర్మాణంతో పాటు శాశ్వత ప్రాతిపదికన తూరలు ఏర్పాటుచేస్తామన్నారు. అనంతరం బాపనాపల్లి గ్రామస్తులు ఆయన్ని కలిశారు. రహదారులు ఛిద్రంగా మారాయన్నారు. కనీసం నడిచేందుకు కూడా వీలులేకుండా ఉన్నాయని ఆయనకు తెలిపారు. ఇళ్లకు బిల్లులు ఇవ్వకపోవడంతో పునాధుల్లోనే ఆగిపోయాయని తెలిపారు. లోకేేష్ మాట్లాడుతూ గుంతల్లో రోడ్లు వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పి.మల్లవరం గ్రామస్తులు లోకేష్‌కు సమస్యలపై వినతిపత్రం అందించారు. జిఎస్‌పిసి హామీలు అమలు చేయట్లేదన్నారు. గ్రామంలో గ్రంథాలయం, 50పడకల ఆసుపత్రిని నిర్మించాలని, అంబులెన్సు ఏర్పాటు చేయాలన్నారు. ఇంటి నిర్మాణానికి ఒఎన్‌జిసి రూ.50వేలు సాయం అందించేలా చూడాలన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఒఎన్‌జిసితో చర్చించి హామీల అమలుకు చర్యలు తీసుకుంటామని లోకేష్ వారికి తెలిపారు. పలువురు నిరుద్యోగులు ఆయన వద్ద సమస్యలు ఏకరువు పెట్టారు. రియలయన్స్, జిఎస్‌పిసి, ఒఎన్‌జిసి కంపెనీలు ఉన్నా ఇక్కడ నిరుద్యోగులకు అవకాశం కల్పించట్లేదన్నారు. లోకేష్ స్పందిస్తూ… జగన్‌కు కమీషన్లపై ఉన్న శ్రద్ధ పరిశ్రమలు, ఉద్యోగాల కల్పనపై లేదన్నారు. చంద్రబాబు తెచ్చిన కంపెనీలను జే ట్యాక్స్ కోసం వేధించి తరిమేశాడన్నారు. లక్షలాది ఉద్యోగాలు కల్పించే ఫ్యాక్స్ కాన్, లులూ, అమర్ రాజా, జాకీ వంటి పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయన్నారు. తాము అధికారంలోకొస్తే తాళ్లరేవులోని కంపెనీలతో మాట్లాడి ఉద్యోలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిరుద్యోగులకు రూ.3వేల భృతి అందిస్తామన్నారు. ప్రతి ఏటా జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అలాగే ఇసుక నావ కార్మికులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, వడ్రంగి మేస్రీలు, ఇతర చేతివృత్తుల వారి సమస్యలను ఆయన విన్నారు. తాళ్లరేవులో ఫిష్ ఆంధ్ర పేరుతో ఏర్పాటు చేసిన సర్కారు వారి చేపలు దుకాణాన్ని పరిశీలించారు. డిగ్రీలు, పీజీలు చేసిన వారిలో జగన్ చేపల దుకాణాలు, మటన్ మార్టులు పెట్టిస్తున్నాడని విమర్శించారు. తాళ్లరేవులో ఘన స్వాగతంతాళ్లరేవులో నారా లోకేష్‌కు ఘన స్వాగతం లభించింది. రవి జూనియర్ కళాశాల నుంచి విద్యార్థులతో కలిసి ఆయన కొంత దూరం పాదయాత్ర చేశారు. జార్జి పేట వై.జంక్షన్, పి.మల్లవరం జంక్షన్, జైభీమ్‌పేట వద్ద నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. హారతులు పట్టారు. తాళ్లరే సంతపేట సెంటర్లో కంచర్ల లక్ష్మోజి, మాజీ సర్పంచ్ వాసనశెట్టి శ్రీనివాస్, ఎంపిటిసి మాజీ సభ్యులు గంజా సూరిబాబు ఆధ్వర్యంలో గజమాలతో స్వాగతం పలికారు. ఆయన వెంట టిడిపి అమలాపురం పార్లమెంట్ ఇన్‌ఛార్జి గంటి హరీష్ మాథూర్, మాజీ ఎంఎల్‌ఎ దాట్ల సుబ్బరాజు, జనసేన నాయకులు పితాని బాలకృష్ణ, కందుల దుర్గేష్, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ఎంఎల్‌ఎ బుచ్చయ్య చౌదరి తదితరులున్నారు.