దాడిని ఖండిస్తూ వైద్యుల నిరసన ప్రదర్శన

ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ : రోగి మృతి నేపథ్యంలో స్థానిక అనన్య వైదశాల సిబ్బందిపై దాడి చేసిన విషయం తెలిసిందే. దీన్ని ఖండిస్తూ ఇండియా మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) ఆధ్వర్యంలో పట్టణంలోని అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు మంగళవారం బంద్‌ పాటించాయి. ‘సేవ్‌ డాక్టర్స్‌ – సేవ్‌ జస్టిస్‌’ నినాదంతో పట్టణంలో భారీ ర్యాలీ చేశారు. అనంతరం డీఎస్పీ బి.ఆదినారాయణను కలిసి వినతిపత్రం ఇచ్చారు. వైద్యులను భయబ్రాంతులకు గురి చేసేలా రోగి బంధువులు వ్యవహరిస్తే తాము వైద్యమెలా చేస్తామని ఆవేదన వెలిబుచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో వైద్యులు గజ్జల నాగభూషణరెడ్డి, శారదారెడ్డి, నాగరాజారెడ్డి, జి.శ్రీధర్‌, ఫణి ప్రశాంతి, గిరిజ, అరుణకుమారి, కనగాల రాజేష్‌, లాబ్‌ టెక్నీషియన్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️