ఇప్పటికే పలుచోట్ల తేలికపాటి జల్లులు
ఒబ్బిడి చేసుకునే పనిలో అన్నదాతలు
జిల్లా అధికారుల అప్రమత్తం
కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్
తుపాను హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతలు బెంబేలెత్తుతున్నారు. ఖరీఫ్ పంట చేతికందొచ్చే సమయంలో తుపాను వార్తలు వారికి కలవరానికి గురిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ఐఎండి అంచనాల ప్రకారం ఆగేయ బంగాళాఖాతంలో వాయుగుండం శనివారం నాటికి తీవ్రవాయుగుండంగా బలపడనుందని తరువాత తుపానుగా మారుతుందని అధికారులు చెబతున్నారు. దీని ప్రభావంతో ఆదివారం నుంచి మంగళవారం వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కుస్తాయని చెబుతున్నారు. మంగళవారం అక్కడక్కడ అతితీవ్ర భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆదివారం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 55 -75 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీసే అవకాశం ఉందన్నారు.జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 1.75 లక్షల ఎకారల్లో వరిసాగు చేపట్టారు. దిగుబడి ఎకరాకు 40 బస్తాల వరకూ వస్తుందని అంచనాలు వేశారు. ప్రస్తుతం పంట కోత దశలో ఉంది. కొన్ని చోట్ల ఇప్పటికే కోతలు పూర్తి చేశారు. మరో 50శాతం పంట ఇంకా పొలాల్లోనే ఉంది. ఇప్పటికే అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాల కారణంగా వారం రోజుల పాటు కురిసిన వర్షాలకు కోతలను నిలిపేశారు. కాస్త అనుకూలంగా ఉందనుకున్న సమయంలో మళ్లీ తుపాను హెచ్చరికలతో వారు ఆందోళన చెందుతున్నారు. కొంత మంది యంత్రాలతో హడావుడిగా కోతలను పూర్తి చేస్తున్నారు. కోతలు పూర్తి చేసినప్పటికీ కొనుగోళ్లు మందకొడిగా ఉండటం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే వాతావరణం చాలా వరకూ మారిపోయింది. ధాన్యం ఎండే పరిస్థితి కూడా ఎక్కడా లేదు. మరోవైపు తేమ నిబంధన కారణంగా ధాన్యాన్ని కొనుగోళ్లు కేంద్రాల్లో కొనుగోలు చేయట్లేదు. ఈ పరిస్థితుల్లో అన్నదాతలు మనస్తాపానికి గురవుతున్నారు. పరిస్థిలును దళారులు వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. అయినకాడికి రైతుల నుంచి ధాన్యాన్ని తరలించుకుపోతున్నారు. వాతావరణం సరిగా లేకపోవడంతో అయికాడికి అన్నదాతలు కూడా అమ్ముకునే పరిస్థితి దాపురించింది. వర్షాల సమయంలో ధాన్యానాన్ని దాచుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో కొంత మంది రైతులు రోడ్లపైనే ధాన్యాం రాసులు వేశారు. వాటిపై బరకాలను సైతం ప్రభుత్వ సరఫరా చేయట్లేదనివారు వాపోతున్నారు. వర్షాలు వస్తే ఈ ధాన్యం అంతా తడిచిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం స్పందించి తేమ నిబంధనలను సడలించాలని, ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పలువురు కోరుతున్నారు. తుపాను నేపత్యంలో మరోపక్క అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. ఖరీఫ్ పంట కోతల సమయం దష్ట్యా రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా, డివిజన్ , మండల స్థాయి యంత్రాంగం అప్రమత్తం గా ఉండాలని, వారి వారి ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
కలెక్టరేట్, బొమ్మూరు.. 8977935609,
ఆర్‌డిఒ కార్యాలయం, రాజమండ్రి .. 0883-2442344,
ఆర్‌డిఒ కార్యాలయం కొవ్వూరు 08813231488