ప్రజాశక్తి-మార్కాపురం: వైసిపి దురాగతాలకు, దుర్మార్గాలకు అడ్డుకట్ట పడాలంటే టిడిపిని గెలిపించాలని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. పట్టణంలోని 12వ వార్డులో ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వంలో అందించబోయే మహాశక్తి పథకాల గురించి వివరించారు. చంద్రబాబు నాయుడును 73 ఏళ్ల వయసులో దొంగ కేసులు బనాయించి అక్రమంగా అరెస్టు చేయటం దుర్మార్గమని ప్రజలంతా చెబుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలుపుతో వైసిపి పీడ విరగడవుతుందని ఉద్ఘాటించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మార్కాపురం ప్రత్యేక జిల్లా ప్రకటిస్తామన్నారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేసి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఆయన వివరించారు. మార్కాపురంలో ఏ ఒక్కరూ వచ్చే ఎన్నికల్లో వైసిపికి ఓటు వేసినా ఇక్కడి వైసిపి నాయకుల దుర్మార్గాలను, అరాచకాలను ప్రోత్సహించినట్టేనని అన్నారు. ప్రజలను కడగండ్లపాలు చేస్తున్న ఈ నయవంచక పాలకులను ఇంటికి పంపించాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు, 12వ వార్డు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పొదిలి: రాష్ట్రంలోఅవినీతి అక్రమాలతో ప్రజలపై భారాలు మోపుతూ నిరంకుశ విధానాలు అవలంబిస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఈగలపాడు, పాములపాడు, జువ్వలేరు గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీ, గ్రామ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘సంక్షేమం’ పేరుతో ‘సంక్షోభ’ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. వైసిపి ప్రభుత్వం ప్రజా సంపద దోపిడీకి పాల్పడుతూ ప్రజలపై భారాలు మోపుతూ వారి జీవనాన్ని ఛిన్నాభిన్నం చేస్తోందన్నారు. తమ పార్టీ అమలు చేయాల్సిన ‘భవిష్యత్తు గ్యారెంటీ’ రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ చిన్నపురెడ్డి సుబ్బులు యర్రారెడ్డి, గ్రామ నాయకులు భోగిరెడ్డి కోటిరెడ్డి, నుగ్గుశిశయ్య, పెమ్మని నరసింహం, పెమ్మని కొండలు, భోగిరెడ్డి అంజిరెడ్డి, కాటం వెంకటేశ్వర్లు, ముసలారెడ్డి, రవిచంద్ర, పాపిరెడ్డి, ఆయా గ్రామాల తెలుగుదేశం నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.