జీవనోపాధికి ఎసరు..!

Nov 29,2023 23:01
కార్పొరేట్‌ సంస్థలే

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

మత్స్యకారుల సంక్షేమాన్ని వైసిపి ప్రభుత్వం విస్మరిస్తుంది. వారి సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది. పలు పథకాలు అందుబాటులో ఉన్నా అక్కరకు రాకుండా చేస్తోంది. వీటికితోడు వారి జీవనోపాధికి ఎసరు పెట్టేందుకు సిద్ధమౌతుంది. మత్య్సకారుల మనుగడనే ప్రశ్నార్ధకం చేసే జిఒ నెంబర్‌ 217ను అమలుకు సిద్ధమైంది. ఏకపక్షంగా వ్యవహరించి ఈ జిఒను అమలు చేస్తే సహించేది లేదని మత్స్యకార సంఘాల హెచ్చరిస్తున్నాయి. ఉనికికే ప్రమాదం కాకినాడ, కోనసీమ జిల్లాల్లో తొండంగి, యు.కొత్తపల్లి, కాకినాడ రూరల్‌, కాకినాడ అర్బన్‌, తాళ్లరేవు, ఐ.పోలవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, అల్లవరం, సఖినేటిపల్లి తదితర 13 మండలాల్లో 144 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం విస్తరించి ఉంది. కోస్తా తీర ప్రాంతంలో 3.55 లక్షల జనాభా నివసిస్తున్నారు. చేపల వేట ద్వారా సుమారు 70 వేల కుటుంబాలు ఉపాధిని పొందుతున్నాయి. చెరువులు, జలాశయాలు, సరస్సులు, నీటిపారుదల కాలువలు, చిత్తడి నేలలు, మురుగు కాలువల్లో మత్స్య సంపద పెంపకానికి, అమ్మకానికి మత్స్యకార సంఘాలకు ప్రాధాన్యం ఇస్తూ మార్గదర్శకాలున్నాయి. మత్స్యకార సంఘాలు లేకపోయినా, లీజుకు ముందుకు రాకపోయినా తర్వాత ప్రాధాన్యం స్థానిక గ్రామ పంచాయతీకే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇది కాకుండా బహిరంగ వేలం నిర్వహించేలా జిఒ నెంబర్‌ 217ను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం వచ్చే ఆదాయంలో పంచాయతీకి 10 శాతం, మత్స్యశాఖకు 20, జలవనరుల శాఖకు 40 శాతం కేటాయిస్తారు. 30 శాతం ఆదాయాన్ని లేదా సంఘంలోని సభ్యులకు సంవత్సరానికి రూ.15 వేలు చొప్పున ఇవ్వనున్నారు. ఈ జిఒ అమలైతే మత్స్యకారుల ఉనికి, ఉపాధి ప్రమాదంలో పడనుంది. ఏళ్ల తరబడి మత్స్యకార సంఘాలను ఆదుకుంటున్న నీటి వనరులకు బహిరంగ వేలం నిర్వహించి, దానిద్వారా వచ్చే ఆదాయాన్ని పంచాయతీ, జలవనరులు, మత్స్యశాఖ సంఘాలకు వాటాల పద్ధతిని ప్రవేశపెట్టడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లనుంది. మత్స్యకార సంఘాల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలే ఎక్కువగా ఉన్నారు. వీరంతా బహిరంగ వేలంలో పోటీపడలేరు. దీనివల్ల బడా బాబులు, కార్పొరేట్‌ సంస్థలే చేజిక్కించుకునే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల మత్స్యవేటపై ఆధారపడిన వేలాది కుటుంబాలు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉంది..

➡️