ప్రజాశక్తి – యంత్రాంగం
జిల్లాలో పలుచోట్ల భారీవర్షం కురిసింది. గత రెండురోజులుగా ఆకాశం మేఘావృతమై తరచూ చిరుజల్లులు పడుతున్నాయి. ఈ క్రమంలో గురువారం సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. ప్రస్తుతం వరి మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అన్నదాతకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాల్లో, రోడ్ల వెంబడి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. పనల మీద ఉన్న వరి తడిసిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలోని పెదపాడు, పెదవేగి, దెందులూరు, భీమడోలు, ఏలూరు పట్టణం, రూరల్, కైకలూరు, ముదినేపల్లి, కలిదిండి, నూజివీడు తదితర మండలాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లో రైతులు పంటను కాపాడుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. తడిసిన ధాన్యం చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. ధాన్యం మొలకెత్తే ప్రమాదం ఉందని, రంగుమారి కొనుగోలు చేసే అవకాశం ఉండదని, పెట్టుబడులు, కష్టం అంతా ‘నీటి’పాలేనని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు అర్బన్ : ఏలూరు నగరంలో గురువారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణం మేఘావృతమై చల్లబడి భారీవర్షం కురిసింది. మూడు రోజులుగా వాతావరణంలో మార్పులు వచ్చి తరచూ చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సుమారు గంటపాటు ఏకథాటిగా భారీ వర్షం కురిసింది. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. పత్తేబాద, ఆర్‌ఆర్ పేట, కొత్తపేట, పవర్‌పేటలోని రోడ్లలో మోకాళ్లలోతు నీరు చేరింది. నగరంలో అనేక ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడంతో వర్షానికి తడిసి తీవ్రదుర్గంధం వెదజల్లుతుంది. రోడ్లపక్కన వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులు వర్షానికి ఇబ్బంది పడ్డారు. సామగ్రి తడిసిపోయి నానా అవస్థలు పడ్డారు. సాయంత్రం పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు వదిలే సమయం కావడంతో చాలామంది విద్యార్థులు, ఉద్యోగులు తడుచుకుంటూనే ఇళ్లకు చేరారు. మరోపక్క ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో వరి కోతలు జరుగుతుండడంతో పొలాల్లోని ధాన్యం తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రోడ్లపైన, చేలల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. మాసూళ్లు పూర్తయిన ధాన్యం జాగ్రత్త చేసుకునే అవకాశం కూడా లేకపోవడంతో వర్షానికి తడిసిపోయింది. మొలకలు వచ్చే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.