- బస్టాండుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
- జిల్లా ప్రజా రవాణ శాఖాధికారి రాము
ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : జిల్లాలో రోడ్డు రవాణా సంస్థకు ఈ ఏడాది రూ.4 కోట్లు ఆదాయం పెరిగిందని జిల్లా ప్రజా రవాణ శాఖాధికారి రాము తెలిపారు. గురువారం ఆయన పీలేరు ఆర్టీసి బస్టాండ్, డిపోను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండులో పెచ్చులూడుతున్న పైకప్పును, ప్రయాణికులు వచ్చి, వెళ్లే దారిని పరిశీలించారు. అనంతరం డిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం అక్టోబర్ నాటికి రూ.170 కోట్లు ఆదాయం వచ్చిందని, ఈ ఏడాది అది రూ.174 కోట్లకు చేరుకుందన్నారు. ప్రజా రవాణా పరిధి గతంలో 57,40,000 కిలోమీటర్లు కాగా, ప్రస్తుతం అది 54,10,000 కిలో మీటర్లకు తగ్గిందని అన్నారు. అలాగే ఈపికె కూడా 41.21 నుంచి 42.40 శాతానికి పెరిగిందని తెలిపారు. ఆర్టీసీ బస్సుల నిర్వహణలో మదనపల్లి-1 డిపో ప్రథమ, మదనపల్లి-2 డిపో ద్వితీయ, పీలేరు డిపో తతీయ స్థానంలోనూ, రాజంపేట, రాయచోటి డిపోలు నాలుగు, ఐదవ స్థానాల్లో ఉన్నాయన్నారు. ఈనెల తిరువన్నామలై గిరి ప్రదర్శనకు వెళ్లే భక్తుల కోసం జిల్లా నుంచి 35 ప్రత్యేక బస్సులు నడపాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు 23 బస్సులకు ప్రయాణికులు సీట్లు రిజర్వ్ చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే శబరిమలైకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు సౌకర్యంగా గత ఏడాది 30 ప్రత్యేక బస్సులు నడిపామని, ఈ సంవత్సరం 60 ప్రత్యేక బస్సులు నడపాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రయాణికులకు సౌకర్యంగా ఆర్టీసీ బస్టాండుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా పీలేరు డిపో పరిధిలోని కాలకాడలో 7 మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.8 లక్షలు నిధులు మంజూరయ్యాయిని అన్నారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలియజేశారు. పీలేరు ఆర్టీసీ బస్టాండులోపై కప్పు పెచ్చులు ఊడడం జరుగుతుందని, దీనివల్ల ప్రయాణికులకు కూడా ప్రమాదం ఉండవచ్చని దీని మరమ్మత్తులతో పాటు మరుగుదొడ్ల నిర్మాణానికి గతంలో పంపిన ప్రతిపాదనలను పున్ణ పరిశీలించాలని సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. త్వరలోనే తగిన పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అదేవిధంగా బి. కొత్తకోటలో ఆర్టీసీ డిపో పున్ణ ప్రారంభానికి చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీలేరు డిపో మేనేజర్ బండ్ల కుమార్, సిఐ సుబ్బమ్మ, ఆర్టీసి ఉద్యోగులు, కార్మిక నాయకులు, ప్రయాణికులు పాల్గొన్నారు.