ప్రజాశక్తి-సీలేరు
జీకే వీధి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని ఎపి ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షుడు కొర్రా బాలయ్య, నాయకులు పాంగి బాబురావు, సిఐటియు మండల కార్యదర్శి గడుతూరు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు జికె.వీధి మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించి పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ తీవ్ర వర్షాభావం వల్ల వరి, మినప, రాజ్‌మా తదితర పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కొంతమేరకు అక్కడక్కడ పండిన వరి పంట కోతలు కోసి పొలాల్లో ఉండగా, ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పొలాల్లో వరి పంట తడిసిపోయి, ధాన్యం మొలకలు వచ్చి పూర్తిగా నాశనమైందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యవసాయ శాఖ అధికారులను పంపించి పంట నష్టాన్ని అంచనా వేసి గిరిజన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.