ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : ప్రతి విద్యార్థి చక్కగా చదువుకొని ఉద్యోగం సంపాదించి జీవితాన్ని సాఫీగా చేసుకొనేందుకు జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి.శ్రీవరం అన్నారు. గురువారం స్థానిక డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా కరపత్రాన్ని విడుదల చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ డిసెంబర్ 5న తమ కళాశాలలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. ఈ జాబ్ మేళాకు సుమారు 8 ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల చెందిన 400 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పిస్తున్నట్లు ఆమె అన్నారు. ఈ జాబ్ మేళాకు పదో తరగతి పాసైన అభ్యర్థులతో పాటు, ఇంటర్, డిగ్రీ పాసైన, ఫెయిల్ అయిన అభ్యర్థులు హాజరు కావచ్చని తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాను ప్రతి నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అలాగే డిసెంబర్ 1న అంతర్జాతీయ ఎయిడ్స్ డేను పురస్కరించుకుని కళాశాలలో గురువారం వివిధ పోటీలను విద్యార్థులకు నిర్వహించామన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అంతర్జాతీయ ఎయిడ్స్ డే రోజున బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ పిఒలు డి.రామయ్య, త్రినాధ, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.