ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి మరో అల్పపీడనం హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన ఎక్కువైంది. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ముమ్మరంగా వరి కోతలు యంత్రాల సహాయంతో సాగుతున్నాయి. అష్ట కష్టాలు పడి పెట్టుబడులు పెట్టగా మరికొద్ది రోజుల్లో పంట చేతికందే అవకాశం ఉంది. ఇప్పుడు అల్పపీడనం ప్రభావంతో మూడు రోజులు పాటు వర్షాలు కురియువచ్చనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతల్లో అలజడి రేగుతోంది. యానాం సహా కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు అందాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లావ్యాప్తంగా వాతావరణంలో మార్పులు కనిపించాయి. ముసురు అలుముకుంది. మూడు రోజులు పాటు వరి కోతల పనులు నిలుపుదల చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.కాకినాడ జిల్లాలో ఈ ఏడాది 2.40 లక్షల ఎకరాల్లో రైతులు ఈ ఏడాదిని ఖరీఫ్‌లో వరి సాగు చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల మెట్టలో రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. డెల్టాలో కూడా సాగునీరు సక్రమంగా అందక కొన్ని ప్రాంతాల్లో కూడా సాగునీరు సక్రమంగా అందని పరిస్థితి నెలకొంది. దీంతో దిగుబడులు భారీగా తగ్గుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లోనూ వరి కోతలు ముమ్మురంగా జరుగుతున్నాయి. గండేపల్లి, సామర్లకోట, కాజులూరు, పిఠాపురం, పెద్దాపురం, కరప, తాళ్లరేవు తదితర మండలాల్లో సుమారు 63 వేల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి.భయపెడుతున్న వాతావరణం అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురవచ్చనే హెచ్చరికల నేపథ్యంలో రైతులు ప్రస్తుతం గుబులుగా ఉన్నారు. రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు కనిపిస్తున్న నేపథ్యంలో యంత్రాల సహాయంతో రైతులు వరి కోతలను ముమ్మరం చేశారు. అధిక ధరలు వెచ్చించి కోతలు పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనాలంటే 17 శాతం కంటే తేమ తక్కువగా ఉండాలనే నిబంధన ఉండడంతో పలుచోట్ల రైతులు ధాన్యాన్ని రూ.100 నుంచి 200 తగ్గించి దళారులకు విక్రయిస్తున్నారు. వాతావరణం భయపెడుతుండడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో విక్రయించుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. కళ్లాల కొరత వల్ల పలువురు ధాన్యాన్ని రోడ్లపైనే ఆరబోస్తున్నారు. బరకాలు సైతం పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఏ సమయంలో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియక దళారులకు విక్రయిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు ప్రభుత్వం ఆర్‌బికెల ద్వారా 1,441 మంది రైతుల నుంచి రూ.16.92 కోట్లు విలువైన 15,322 మెట్రిక్ టన్నుల దాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు రూ.3.91 కోట్లు బకాయిలు ఖాతాల్లో జమ చేసారు. పంటకు అవసరమైన సాగునీరు అందక ఇప్పటివరకు రైతులు నానా కష్టాలూ పడ్డారు. ఏదో రకంగా గట్టెక్కాలని భావిస్తున్న తరుణంలో అకాల వర్షాలు గనుక ముంచెత్తితే భారీ ఎత్తున నష్టం తప్పేలా లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పెట్టిన పెట్టుబడులు నష్టపోతే మరింత అప్పుల్లోకి కూరుకుపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను ఆసరాగా చేసుకుంటున్న కొందరు ధాన్యం దళారులు రైతులను మభ్యపెట్టి, మోసగించి, భయపెట్టి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సిండికేట్‌గా మారి ధాన్యాన్ని తీసుకువెళుతున్నారు. తక్కువ ధరకే అమ్ముతున్నా బకాయిలు కూడా వెంటనే ఇవ్వడం లేదని పలువురు చెబుతున్నారు. ఈ నెంబర్ జోలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.