ప్రజాశక్తి -వల్లూరు సామాజిక హక్కులు, ఆర్థిక భూమి సమస్యలు తదితర 22 డిమాండ్ల పరిష్కారం కోరుతూ తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సం ఘం ప్రధాన కార్యదర్శి వి.అన్వేష్ పిలుపు నిచ్చారు. ఆదివారం మండలంలోని దళిత పేటలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికీ దళితులపై దాడులు అత్యాచారాలు మానభంగాలు జరుగుతూనే ఉన్నాయని వాపోయారు. మణిపూర్‌లో మనువాదుల చేతుల్లో ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించి అత్యాచారం చేయడం యావత్ భారతదేశాన్ని తలదించుకునేలా చేసిందని తెలిపారు. ఇంత జరిగిన మతోన్మాద ప్రధానమంత్రి మోడీ పల్లెత్తు మాట మాట్లాడకపోవడం దాడులు చేసిన వారికి రక్షణ కల్పించడం సిగ్గుచేటు అన్నారు. బిజెపి రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్ ప్లాన్ చట్టాన్ని రద్దు చేసిందని రిజర్వేషన్లను అమలు జరపకుండా అనేక ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. మనువాద భావజాలాన్ని అమలు చేసి లౌకిక రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతుందని తెలిపారు. దళితుల హక్కులను పాలక పక్షాలు హరించి వేస్తున్నాయని ఎస్‌సి, ఎస్‌టి, బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా దళితులకు ద్రోహం చేస్తున్నారని పేర్కొన్నారు. దళిత హక్కులు సామాజిక ఆర్థిక భూమి సమస్యల పరిష్కారం కోసం తో పాటు 22 డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం కెవిపిఎస్ ఉద్యమం చేపడుతున్నాయని డిసెంబర్ 4న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగ సంతకాల సేకరణ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సుబ్బయ్య, వ్యవసాయ కార్మిక సంఘం వల్లూరు మండల నాయకులు సుబ్బారాయుడు, హరి, వెంకటరమణ పాల్గొన్నారు