ప్రజాశక్తి – కడప ప్రజా వినియోగిత సేవలపై ఆయా శాఖలకు వచ్చిన కేసులను వెంటనే క్లియర్ చేయాలని చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీదేవి, పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ స్వర్ణ ప్రసాద్ అన్నారు. సంయు క్తంగా శనివారం స్థానిక జిల్లా కోర్టు కాంప్లెక్స్ నందలి న్యాయసేవా సదన్‌లో ‘శాశ్వత లోక్ అదాలత్’ ఆధ్వర్యంలో ప్రజా వినియోగిత సేవా రంగాల్లో న్యాయ సేవలపై వివిధ శాఖల జిల్లా అధికారులకు అవగాహన, సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ప్రజా వినియోగిత సేవల చట్టాలపై అవగాహన ఉండాలని పేర్కొన్నారు. పర్మినెంట్ లోక్ అదాలత్ అందించే తీర్పు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుతో సమానమని చెప్పారు. పర్మినెంట్ లోక్ అదాలత్ (పిఎల్‌ఏ) ద్వారా ఫిర్యాదుదారులు ఎలాంటి కోర్టు ఖర్చులు లేకుండా సత్వర న్యాయ పరిష్కారం అందిస్తుందని తెలిపారు. పర్మినెంట్ లోక్ అదాలత్ అందించే తీర్పు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుతో సమానమన్నారు. ఈ తీర్పుకు ఎలాంటి అప్పీలు లేదని, దీని ద్వారా 10 రకాలైన ప్రజా ప్రయోజిత సేవా రంగాలకు సంబంధించిన సేవలలో ఎలాంటి అవాంతరాలు, లోపాల వల్ల వాటిల్లే నష్టాలకు సంబంధించి త్వరితగతిన న్యాయ పరిష్కారం పొందవచ్చన్నారు. మరిన్ని పూర్తి వివరాలకు జిల్లా కోర్టు ఆవరణలోని పర్మనెంట్ లోక్ అదాలత్ కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, పర్మనెంట్ లోక్ అదాలత్ మెంబెర్స్ ఎం.వి. సుబ్బారెడ్డి, ఎం. ఆదినారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.