ప్రజాశక్తి-అచ్యుతాపురం
పరిశ్రమల బస్సు ప్రమాదాలను అరికట్టాలని, కార్మికులకు రక్షణ కల్పించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం అచ్యుతాపురంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము మాట్లాడుతూ ఎస్‌ఇజెడ్‌లోని పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులను విధులకు, తిరిగి ఇళ్లకు చేర్చే బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయని, దీంతో కార్మికులు తమ ప్రాణాలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అచ్యుతాపురం లారస్ కంపెనీ బస్సు ప్రమాద సంఘటన మరువకముందే, పరవాడలో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకొని ఫార్మా కంపెనీ కార్మికుడు వెంకటేష్ మృతి చెందారని తెలిపారు. కంపెనీల బస్సు ప్రమాదాలలో మృతి చెందిన కార్మికులకు కోటి రూపాయలు పరిహారంగా చెల్లించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఈ కాలంలో వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాద సంఘటనలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియూ మండల కన్వీనర్ కె.సోమునాయుడు, కార్మికులు పూడి చందు, శివకోటి, శివరాయ అప్పారావు, సూరంపూడి రమణ, సిహెచ్.రాజు పాల్గొన్నారు. ప్రమాదాలపై విచారణ చేయాలని ఆర్‌టిఒకు వినతిఅనకాపల్లి : జిల్లాలోని వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులను డ్యూటీలకు చేరవేసే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయని, ఆ ప్రమాదాలపై విచారణ చేయాలని కోరుతూ శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో ఆర్టీవో జిల్లా అధికారి ప్రకాశరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్ శంకర్రావు, జి కోటేశ్వరరావు మాట్లాడుతూ యాజమాన్యం డ్రైవర్లతో ఓవర్ డ్యూటీలు, సమయపాలన లేకుండా పనిచేయించడంతో తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ఒకే డ్రైవర్‌ను అన్ని షిఫ్ట్లలో పని చేయించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆర్‌టిఓ అధికారులు బోర్డులు పెట్టినా ఓవర్ లోడ్లతో ఈ మార్గంలో భారీ వాహనాలు తిరుగుతున్నాయని తెలిపారు. అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డులో భారీ వాహనాలు నిషేధించాలని, ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, కోశాధికారి వివి శ్రీనివాసరావు పాల్గొన్నారు.