కార్మికవర్గ పోరాటాలను ఉధృతం చేయాలి

 ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ : ప్రభుత్వరంగ పరిశ్రమలను, కార్మిక హక్కులను రక్షించుకోవడం కోసం పోరాటాలను ఉధృతం చేయడమే నండూరి ప్రసాదరావుకు అర్పించే ఘనమైన నివాళి అని సిఐటియు జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి అజశర్మ పేర్కొన్నారు. నండూరి ప్రసాదరావు 22వ వర్థంతి సభను జగదాంబ సమీపంలోని ఎన్‌పిఆర్‌ భవనంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు పూర్వ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విఎస్‌.పద్మనాభరాజు, ఎ.అజశర్మ నండూరి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ అధ్యక్షతన జరిగిన సభలో అజశర్మ, పద్మనాభరాజు మాట్లాడుతూ, నండూరి ప్రసాదరావు సిఐటియు ఆంధ్రరాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని తెలిపారు. విశాఖ కార్మిక వర్గ ఉద్యమంతో ఆయన జీవితం పెనవేసుకుందన్నారు. ఆంధ్రా యూనివర్శిటీ, హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌లో యూనియన్‌ ఏర్పాటు, అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర వహించారని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణంలోనూ, విశాఖజిల్లాలో బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించడంలోనూ ఏనలేని కృషి చేశారన్నారు. విశాఖ జిల్లాలో జగదాంబ వద్ద ఉన్న సిఐటియు ఆఫీస్‌ను ఆయనే కొనుగొలు చేశారని గుర్తుచేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్‌ మాట్లాడుతూ, నండూరి ప్రసాదరావు వర్థంతి సందర్భంగా గురువారం ప్రపంచీకరణ, ఉపాధి అంశాలపై జాతీయ సెమినార్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సెమినార్‌కు ముఖ్య అతిథిగా ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ హాజరవుతున్నారని చెప్పారు. నండూరి ప్రసాదరావు స్ఫూర్తితో నేడు బిజెపి ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఉధృతమైన పోరాటాలు నిర్వహించడానికి కార్మిక వర్గం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సభలో సిఐటియు సీనియర్‌ నాయకులు ఎస్‌.జ్యోతీశ్వరరావు, వై.రాజు, ఎం.సుబ్బారావు, జి.అప్పలరాజు, జి.పోలేశ్వరరావు, జగదాంబ, మద్దిలపాలెం జోన్‌ కార్యదర్శులు కెవి.చంద్రమౌళి, పి.వెంకటరావు, ఎం.సూరీడు, కె.నరసింగరావు, పీతల అప్పారావు, శివ, కుమారి, భారతి పాల్గొన్నారు.

➡️