కమలేష్‌ మృతిపై సమగ్ర విచారణ చేయాలికలెక్టరేట్‌ వద్ద కుటుంబసభ్యుల ధర్నా

Nov 27,2023 18:18

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

పెదవేగిలోని డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో ఈనెల 20వ తేదీ రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందిన పదవ తరగతి విద్యార్థి దాసి కమలేష్‌ మృతిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ మృతుని కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు పలు దళిత సంఘాల నాయకులు ఏలూరు కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుని తండ్రి వెంకటేశ్వర రావు, సామాజిక కార్యకర్త జి.కుమార్‌ రాజా, దళిత నాయకులు అలగా రవికుమార్‌లు మాట్లాడుతూ సోమవారం రాత్రి 12 గంటల 30 నిమిషాలకు స్కూల్‌ సిబ్బంది తమకు సమాచారం ఇచ్చారని, వెంటనే తాము ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి రాగా అప్పటికే కమలేష్‌ మృతదేహాన్ని మార్చురీకి తరలించి మృతదేహాన్ని చూసేందుకు కూడా తమకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అనంతరం తాము పాఠశాలకు వెళ్లి విచారించగా తమ కుమారుడు ఉరివేసుకుని మరణించాడని, పాఠశాలకు గైర్హాజరు అని పొంతనలేని సమాధానాలు చెప్పారని తెలిపారు. సకాలంలో పాఠశాల సిబ్బంది, ప్రిన్సిపల్‌ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా హుటాహుటిన ఆసుపత్రికి తరలించి తమకు మాత్రం తమ కుమారుడికి సీరియస్‌గా ఉందని చెప్పి విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. గతంలో కూడా తమ కుమారుడిపై పాఠశాలలో దాడులు జరిగాయని, ఆ పాఠశాలలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, చూడకూడనిది ఏదో తమ కుమారుడు చూడటం వల్లే తమ కుమారుడు హత్యకు గురి అయ్యాడని వారు పేర్కొన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి, పాఠశాల ప్రిన్సిపల్‌తో పాటు దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️