కదం తొక్కిన విద్యార్థులు-

Dec 1,2023 22:54
పోలీసులు లాక్కెళుతున్న దృశ్యం

పోలీసులు లాక్కెళుతున్న దృశ్యం
కదం తొక్కిన విద్యార్థులు-
పోలీసులకు, ఎస్‌ఎఫ్‌ఐ నేతల మధ్య తోపులాట
-23 మందిని అరెస్టు చేసి పోలీసులు
ప్రజాశక్తి-నెల్లూరు :విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్‌ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు కలెక్టర్‌ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో గాంధీబొమ్మ నుంచి కలెక్టరేట్‌ వరకు విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్‌ లోపలకు ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులను వెళ్లనీయకుండా అడ్డుకొనేందుకు మహబూబ్‌ఖాన్‌ పార్కు సమీపంలోని కలెక్టరేట్‌ ద్వారం వద్ద పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. ఈ విషయాన్ని పసిగట్టిన విద్యార్థులు తమ ప్రదర్శనను కలెక్టరేట్‌ ప్రధాన గేటు వైపునకు మళ్లించారు. ప్రధాన గేటు వద్దకు విద్యార్ధులు చేరుకోనే సమయానికి ఆ ప్రదేశానికి చేరుకొనేందుకు పోలీసులు పరుగులు తీశారు. ఎట్టికేలకు విద్యార్ధులను కలెక్టరేట్‌లోని వెళ్లనీయ్యకుండా అడ్డుకున్నారు. విద్యార్ధులు కలెక్టరేట్‌ గేటు వద్ద నినాదాలు చేసి పోలీసులను మభ్యపెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కొద్ది సమయం తరువాత విద్యార్థులు ఒక్కసారిగా కలెక్టరేట్‌ లోపలికి వెళ్లేందుకు గేటు ఎక్కేందుకు కొంత మంది ప్రయత్నించగా, మరి కొంత మంది కలెక్టర్‌ కార్యాలయం రెండవ గేటు వైపు నుంచి వెళ్లేందుకు పరుగులు తీశారు. విద్యార్ధులు చేసిన ప్రతి ప్రయత్నాన్ని భగం చేయడంలో పోలీసులు సఫలం అయ్యారు. ఈ సమయంలో కలెక్టరేట్‌ ఎదుట ఉన్న బురదలో విద్యార్థులు పడిపోవడంతో కొంత మందికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో సుమారుగా 23 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్లు పూర్తి కావస్తుందని, ఈ నేపథ్యంలో వైసిపి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పథకం, విద్యాదీవెన, విద్యార్థుల వసతి బకాయిలు లక్షా డెబ్బైనాలుగు వేల కోట్ల రూపాయలు ఉన్నాయని వాటిని ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు అందజేయలేకపోయిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ప్రకటించిన పథకాలకు సంబంధించి నగదు జమ చేసేందుకు బ్యాంకుల్లో జాయింట్‌ అకౌంట్‌ ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం చూస్తే ఈ బకాయిలను పూర్తిగా ప్రభుత్వం ఎగవేత వేసే దిశగా అడుగులు వేస్తుందన్న అనుమానం వస్తుందన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు కనీస వసతులు కల్పించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. గురుకుల పాఠశాలలో ఖాళీలలను భర్తీ చేయాలని, వార్డెన్‌ పోస్టులు బర్తీ చేయాలన్నారు.పిజి విద్యార్థులకు ఫీజ్‌ రీయింబర్సుమెంట్‌ను రద్దు చేసింది. ఈ వైసిపి ప్రభుత్వ పాలనలోనే కాదా అని ప్రశ్నించారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, డిగ్రీ కళాశాల లేకపోవడం సిగ్గు చేటన్నారు.ఇంతటి సమస్య ఉంటే అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు చట్ట సభల్లో మాట్లాడకపోవడం దారుణమన్నారు. విఆర్‌ విద్యాసంస్థలను మూసివేసిన ఘనత ఈ వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇదిలా ఉంటే జిల్లా వ్యాప్తంగా 3వేల400 పాఠశాలలను ఇతర పాఠశాలల్లోకి కలిపేసి పాఠశాల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.మెడికల్‌ సీట్లును నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ పేరుతో సగానికి పైగా విక్రయించుకొనే విధంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో పలువురు ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️