ప్రజాశక్తి- రాచర్ల : మండల పరిధిలోని అచ్చంపల్లె గ్రామంలో గ్రామీణ విత్తనోత్పత్తి పథకం సాగు చేసిన కంది పంటను గిద్దలూరు సహాయ వ్యవసాయ సంచాలకులు డి. బాలాజీ నాయక్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం బాలాజీ నాయక్ మాట్లాడుతూ గ్రామీణ విత్తనోత్పతి పథకం ద్వారా సాగు చేసిన ఎల్‌ఆర్‌జి 105 కంది పంట 160 నుంచి 170 రోజుల్లో పంట దిగుబడి వస్తుందన్నారు. ఎకరానికి 9 నుంచి 10 క్వింటాల్ దిగుబడి వస్తుందన్నారు. ఎల్‌ఆర్‌జి 105 కంది విత్తనాలు ఎండుతెగులు, వైరస్‌ను తట్టుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం కంది పంట పూత దశ నుంచి కాయ ఏర్పడే దశలో ఉందన్నారు. ఈ సమయంలో మారుక మచ్చలు పురుగు పంటను ఆశించే అవకాశం ఉందన్నారు. ఈ పురుగు పూతలను కాయలను గూడుగా ఏర్పరచుకొని లోపల ఉండి తింటుందన్నారు. దాని నివారణకు ఫ్లూ బండి ఎమైడ్ ,గొడ్డు తెగులు రాకుండా ఉండడానికి ప్రాపర్ గైట్ మందులను పిచికారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక వ్యవసాయ శాఖాదికారి షేక్ మహబూబ్ బాషా, రాచర్ల ఎఒ షేక్ అబ్దుల్ రఫిక్, వ్యవసాయ విస్తరణ అధికారి సంపత్ కుమార్, గ్రామ వ్యవసాయ సహాయకుడు షేక్ నబీ యూనస్, రైతులు పాల్గొన్నారు.