ఓట్ల తొలగింపునకు నోటీసులు ఎలా ఇచ్చారు?

ప్రజాశక్తి – వినుకొండ : స్థానికంగా ఉంటున్న వారి ఓట్లను తొలగించేందుకు అధికారులు నోటీసులు ఇవ్వడం పై పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి సానుభూతిపరుల తొలగించేందుకు టార్గెట్‌ చేసి వైసిపి వ్యవహరిస్తున్నారని శావల్యాపురం తహశీల్దార్‌ను మంగళవారం కలిసి ఫిర్యాదు చేశారు. మండలంలోని కొత్తలూరులో సుమారు 20 మంది టిడిపి సానుభూతిపరుల ఓటు ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ నోటీసులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. అనేక గ్రామాల్లో వందల సంఖ్యలో ఇలా ఓట్ల తొలగింపుకు నోటీసులు పంపించారని, దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఓటమి భయంతో వాలంటీర్లను అడ్డం పెట్టుకుని వైసిపి నాయకులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, టిడిపి సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు పూనుకున్నారని మండిపడ్డారు. ఈ తంతులో ప్రభుత్వ ప్రమేయం ఉందని, సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అంతా నడిపిస్తున్నారని, వాలంటీర్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఐప్యాక్‌ సంస్థకు చేర్చారని ఆరోపించారు. ఎన్నికలకు ఇంకా మూడునెలలే ఉన్నందున రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తక్షణమే యుద్ధప్రాతిపదికన దొంగఓట్ల తొలగించాలని కోరారు. అర్హతతున్న వారికి ఓటు హక్కు ఇవ్వాలని, ఫారం 7 ఎన్నికల కమిషన్‌ పర్యవేక్షణలో జరగాలని అన్నారు. వాలంటీర్లను, గ్రామ సచివాలయ వ్యవస్థలను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలన్నారు. జగన్‌ను మరలా ఎందుకు ఎన్నుకోవాలనే కార్యక్రమంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన కుండా ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎన్నికల విధుల్లో నియ మించాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు గుంటూరు సాంబశివరావు, నాయకులు పాల్గొన్నారు.

➡️