ఓట్లు తొలగిస్తే చర్యలు తీవ్రం : ఆర్‌డిఒ భాస్కరరెడ్డి

ఓట్లు తొలగిస్తే చర్యలు తీవ్రం

ప్రజాశక్తి-భీమునిపట్నం: ఓట్లు తొలగిస్తే చట్టప్రకారం చర్యలు తీవ్రంగా ఉంటాయని స్థానిక ఆర్‌డిఒ ఎస్‌.భాస్కరరెడ్డి స్పష్టం చేశారు. ఆర్‌డిఒ కార్యాలయంలో బుధవారం సాయంత్రం పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో ఓట్లు లేవంటూ కొందరు ఆందోళన చెందుతున్నారని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఆయన స్పందిస్తూ అర్హత కలిగిన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోయేందుకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఓట్లు తొలగించినట్లు ఆధారాలతో రుజువు చేస్తే సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్‌ మొదటి వారంలో అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద బిఎల్‌ఒలు అందుబాటులో ఉంటారని, సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చని ఆర్‌డిఒ తెలిపారు. ఈ సమావేశంలో తహశీల్దార్‌ సిహెచ్‌వి రమేష్‌, ఎలక్షన్‌ డీటీ భాస్కరరావు, వైసిపి నాయకులు గాడు శ్రీను, చిల్ల హరి, చంద్రశేఖర్‌, టిడిపి నాయకులు వై.అనీల్‌ప్రసాద్‌, జనసేన నాయకులు నాగోతి నరసింహనాయుడు, బిజెపి నాయకులు రామానాయుడు పాల్గొన్నారు.

➡️