ఓటర్ల జాబితాపై సమీక్ష

 ప్రజాశక్తి-విశాఖపట్నం : తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించాలని ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలు, బిఎల్‌ఒలను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున ఆదేశించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో ఓటరు జాబితా కీలకమని పేర్కొన్నారు. జిల్లాలో అందరు ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలు, బిఎల్‌ఒలతో ఓటరు జాబితా రూపకల్పన, చేరికలు, తొలగింపు, ఎన్నికల జాబితా స్వచ్చికరణ, యువ ఓటర్ల నమోదు, జెండర్‌ రేషియో, ఈపి రేషియో, ట్రాన్సజెండర్స్‌, నిరాశ్రయులను ఓటర్లుగా నమోదు, ఎన్నికల ఫిర్యాదులు తదితర అంశాలపై కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చనిపోయిన వారి దరఖాస్తులకు సంబంధించి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా పరిశీలించాలని చెప్పారు. ఓటరు జాబితాకు సంబంధించిన అన్ని రికార్డులను తప్పక నిర్వహించాలన్నారు. జిల్లాలో అక్టోబర్‌ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పించాలని సూచించారు. నిరాశ్రయులు, ట్రాన్సజెండర్లను ఓటర్లుగా నమోదు చేయుటకు అవగాహన కల్పించాలన్నారు. ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్‌, డెమోగ్రాఫికల్‌ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని ఆదేశించారు. ఒకే డోర్‌ నెంబరులో 10 ఓట్ల కంటే ఎక్కువ ఉంటే నిశితంగా పరిశీలించాలని సూచించారు. సవరణలో భాగంగా ఫారం-8 ద్వారా వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో విచారణ చేయాలన్నారు. ఓటరు జాబితాలో డోర్‌ నెంబర్‌ లేకపోవడం, మరణించిన వారి పేర్లు తొలగించకపోవడం, ఫొటోలు కనపించకపోవడం, డబుల్‌ ఎంట్రీలు, దొంగ ఓట్లుపై దృష్టి సారించి ఖచ్చితమైన ఓటరు సర్వే చేపట్టాలన్నారు. ప్రత్యేక క్యాంపులు పెట్టి ఎక్కువ మంది యువ ఓటర్లకు అవకాశం కల్పించాలని, కళాశాల్లో చదివే విద్యార్థుల వివరాలను సేకరించి వారందరికీ ఓట్లు ఉన్నాయో లేదో పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌కుమార్‌, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️