ఎస్వీయూ ఇన్‌ఛార్జి విసిగా సుందరవల్లి

Nov 24,2023 22:06
యూనివర్సిటీ అభివృద్ధిని వివరిస్తున్న వీసీ రాజారెడ్డి

ఎస్వీయూ ఇన్‌ఛార్జి విసిగా సుందరవల్లి ప్రజాశక్తి – క్యాంపస్‌ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా మూడు సంవత్సరాల పదవి కాలం పూర్తి కావడంతో ఆచార్య కే. రాజారెడ్డి శుక్రవారం పదవి విరమణ చేశారు. ఆచార్య కే.రాజారెడ్డితో పాటు దాదాపుగా రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల విసిల పదవీకాలం నేటితో ముగిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మొత్తం ఐదు విశ్వవిద్యాలయాలకు రాష్ట్రంలో ఇన్చార్జ్‌ విసిలను నియమించింది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్యామలరావు ఈ మేరకు ఉత్తర్వులు పంపించారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఇన్చార్జి ఉప కులపతిగా నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వీసి ఆచార్య జిఎం సుందరవల్లిని, ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసి ఆచార్య డి. భారతిని, శ్రీ కష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఇన్చార్జిగా యోగి వేమన విశ్వవిద్యాలయం వీసి ఆచార్య సుధాకర్‌ ను, కర్నూల్‌ రాయలసీమ విశ్వవిద్యాలయం ఇన్చార్జి ఉపకులపతిగా అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీ విసి రెహమాన్‌ ను, ఆంధ్ర యూనివర్సిటీ కి ఆంధ్ర యూనివర్సిటీ రెక్టార్‌ ఆచార్య సమతాను ఇంచార్జ్‌ విసి గా నియమించారు. ఇన్చార్జి విసిగా ఆచార్య జీఎం. సుందరవల్లి శనివారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఆంగ్ల విభాగానికి చెందిన ఆచార్య జిఎం సుందరవల్లి సంవత్సరం క్రితం నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా వెళ్లారు. తిరిగి ఎస్వీయూ ఇన్చార్జ్‌ ఉపకులపతిగా రావడం పట్ల బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారుపదవీకాలం పూర్తయిన సందర్భంగా యూనివర్సిటీ అభివృద్ధిని వివరిస్తున్న వీసీ రాజారెడ్డి

➡️