ప్రజాశక్తి – కాకినాడ
ఈ ఏడాది డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో కాకినాడలో జరగనున్న ఎస్‌ఎఫ్‌ఐ 24వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు, జెఎన్‌టియుకె విసి డాక్టర్ జివిఆర్ ప్రసాద్ రాజు పిలుపునిచ్చారు. స్థానికంగా గురువారం రాష్ట్ర మహాసభల గోడపత్రికను ఆయన ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ కేంద్రంగా జరుగుతున్న ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1970లో ఏర్పడిన భారత విద్యార్థి సమాఖ్య(ఎస్‌ఎఫ్‌ఐ) 53 ఏళ్ల చరిత్రలో కాకినాడ నగరంలో మొదటిసారిగా రాష్ట్ర మహాసభలు నిర్వహించుకునేందుకు సిద్ధమైందని అన్నారు. దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎస్‌ఎఫ్‌ఐ గుర్తింపును సాధించిందని తెలిపారు. డిసెంబరు 27, 28, 29 తేదీల్లో జరిగే రాష్ట్ర మహాసభల్లో విద్యాభిమానులు, విద్యావేత్తలు, మేథావులు సహకరించాలని, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే ఎస్‌ఎఫ్‌ఐ నాయకత్వానికి కాకినాడ జిల్లా విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. వరహాలు, ఎమ్.గంగా సూరిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.రాజా, నాయకులు వై.భాస్కర్ పాల్గొన్నారు.