ప్రజాశక్తి-మార్కాపురం : ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ హెచ్చరించారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన క్లెయిమ్స్ పరిష్కారంపై స్థానిక సౌజన్య కన్వెన్షన్ హాలులో బిఎల్‌ఒలు, సూపర్‌వైజర్లు, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో నియోజకవర్గ స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ క్లెయిమ్స్ పరిష్కారంలో నిబంధనలు ఉల్లంఘించరాదని స్పష్టం చేశారు. లోప రహితమైన ఓటర్ల జాబితాను రూపొందించడంలోనే ఎన్నికల ప్రక్రియ దాదాపు సగం పూర్తయినట్లుగా ఉంటుందన్నారు. ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా ఓటర్ల జాబితాను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. బిఎల్‌ఒలు, సచివాలయ సిబ్బంది ఎన్నికలకు సంబంధించిన విధులను రెగ్యులర్ డ్యూటీ కాదనే అభిప్రాయంతో ఉండరాదన్నారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న ఏ ఉద్యోగి అయినా చట్టప్రకారం ఎన్నికల విధులలో ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. ఈ విషయాన్ని దష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పెళ్లి చేసుకుని వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన మహిళలు, చనిపోయిన, వలస వెళ్లిన వారి ఓట్ల తొలగింపు విషయంలో బిఎల్‌ఒలు కచ్చితంగా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ఆదేశించారు. డిసెంబరు 9న నాటికి వచ్చే క్లెయిమ్స్‌ను పరిష్కరించి జనవరిలో పబ్లిష్ చేసే ముసాయిదా ఓటర్ల జాబితాలో అర్హుల పేర్లు ఉండేలా చూడాలన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఈపి నిష్పత్తి, జండర్ నిష్పత్తిని బేరీజు వేసుకోవాలన్నారు. ఈ విషయాలలో వాలంటీర్లను భాగస్వాములను చేయవద్దని ఆయన స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండిన విద్యార్థులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా చూడాలని కాలేజీల యాజమాన్యాలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు, మార్కాపురం సబ్ కలెక్టర్ సేతు మాధవన్, నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దారులు పాల్గొన్నారు.