ప్రజాశక్తి-అనకాపల్లి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానం వలన పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కార్యదర్శి అశోక్ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక దొడ్డి రామునాయుడు కార్మిక కర్షక నిలయంలో భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా మహాసభలు శని, ఆదివారాల్లో జరిగాయి. ఇందులో అతిథిగా పాల్గొన్న అశోక్ మాట్లాడుతూ నూతన విద్యా విధానం తీసుకొచ్చి విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య దీవెన, వసతి దీవెన సకాలంలో విడుదల చేయకుండా కొత్త నిబంధన పేరుతో విద్యార్థులను తిప్పడం దుర్మార్గమన్నారు. దీని వల్ల విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ గర్ల్స్ కన్వీనింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సిహెచ్ పావని మాట్లాడుతూ మహిళలపై లైంగిక దాడులను రోజురోజుకూ పెరుగుతున్నాయని, అయినా ప్రభుత్వాలు మహిళల రక్షణకు ఉన్న పటిష్టమైన చట్టాలు అమలు చేయడంలో విఫల మవుతున్నాయని విమర్శించారు. తమ హక్కుల రక్షణకు, అమలుకు విద్యార్థులు, మహిళలు పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు మామిడి రమణ, కార్యదర్శి ఎస్.రమణ, కోశాధికారి గొర్లి తరుణ్, ఉపాధ్యక్షులు గీతాకృష్ణ, జాయింట్ సెక్రెటరీ బాలాజీ, కేశవ, వెంకటేష్, శ్రీను సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.