ప్రజాశక్తి – ఎఎన్‌యు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఎఎన్‌యు కమ్యూనిటీ రేడియోకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్త ప్రాజెక్టు నిర్వహణకు అనుమతి లభించింది. ఈ మేరకు ప్రాజెక్టు వివరాలను జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ విభాగాధిపతి డాక్టర్ జి.అనిత వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూసారం, సేంద్రీయ ఎరువుల పట్ల రైతులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు నిర్వహణకు వర్సిటీలోని కమిటీ కమ్యూనిటీ రేడియో ఎంపికైంది. ఈ రేడియో ద్వారా ఏడాదిపాటు రైతులకు అవగాహన కల్పించడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ ప్రాజెక్టుకు దేశంలోని 65 కమ్యూనిటీ రేడియో కేంద్రాలను గుర్తించగా ఏపీలో ఎఎన్‌యులోని కమ్యూనిటీ రేడియోను ఎంపిక చేశారు. ఏపీ, తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఏకైక కమ్యూనిటీ రేడియోగా వర్సిటీలోనే ఉండడం గమనార్హం. కమ్యూనిటీ రేడియో ద్వారా ఇప్పటికే వర్సిటి పరిధిలో రైతులకు వ్యవసాయ రంగంలో మార్పులు, ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. భూసారం, సేంద్రియ ఎరువులు వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుకు నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీ లిమిటెడ్ ఆర్థిక తోడ్పాటు అందించనుంది. ఈ విషయాన్ని నాగర్జున ఫర్టిలైజర్స్ ప్రతినిదులు శ్రీకాంత్, సింగ్‌లు బుదవారం యునివర్సటీకి వచ్చి వీసీ పి.రాజశేఖర్‌ను కలిసి చెప్పారు. అనంతరం జర్నలిజం విభాగంలోని కమ్యూనిటీ రేడియో సెంటర్‌ను సందర్శించారు. ఏడాది పాటు రోజుకు అరగంటపాటు నడిచే ఈ ప్రోగ్రామ్ 180 కార్యక్రమాలను నిర్వహిస్తారు.